సుల్తాన్‌బజార్, ఆగస్టు 3 : దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో సుమారు 90 శాతం మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతారని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి. హరగోపాల్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ-2020)రద్దు చేయడంతో పాటు ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదానికి పెట్టరాదని తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రజందరికీ విద్యను అందించాలనే ఆకాంక్షలను ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తుందన్నారు.
విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ, రెగ్యులేషన్ సంస్థ, అక్రిడిటేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వలన రాష్ర్టాల హక్కులను కాలరాసిందని అన్నారు. అంతే కాకుండా స్కూల్ కాంప్లెక్స్ పేరు మీద పరిసరాల గ్రామాలలోని, బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తుందని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, సెకండరీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదన్నారు. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేట్ విశ్వ విద్యాలయాలను, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారని అన్నారు. పాఠశాల విద్యలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ పేరు సాకుతో సామాజిక కార్యకర్తలు, కౌన్సిలర్లు, సీనియర్ సిటిజెన్ల ముసుగులో పెద్ద ఎత్తున సంఘ పరివార్ కార్యకర్తల నియామకం జరుగుతుందన్నారు.
మండలాల్లో, జిల్లాల్లో ఉన్న కళాశాలలో ప్రవేశాలకు దేశమంతటికి వర్తించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో ఒకే పరీక్షను నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభు త్వం తీసుకువస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రజా వ్యతిరేక విదానాల కారణంగా అఖిల భారత విద్యా హక్కు వేదిక, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలు పార్లమెంట్ సమావేశాలలో చట్టబద్ధతను కల్పించడానికి బిల్లు పెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీ నారాయణ, టీఎస్ఈసీ ఉపాధ్యక్షుడు ఎంఎన్ కిష్టప్ప, జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, జిల్లా ప్రధాన కార్దయర్శి వినోద్‌కుమార్, టీపీటీఎఫ్ అధ్యక్షుడు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పరశురాం, ఉపాధ్యక్షుడు జి.శ్యాం, పీవైఎల్ కార్యదర్శి ప్రదీప్, డీటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేషం,పీడీఎస్‌యూ బి.రాము తదితరులు పాల్గొన్నారు.