కీసర, ఆగస్టు 2: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 600మంది విద్యార్థులకు షూ, సాక్స్, టై, బెల్ట్, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌళిక వసతులైన మూత్రశాలలు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం, తదితర సమస్యలను పరిష్కరించామని తెలిపారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే దేశ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు.
మండలానికో ఉచిత పరమపద వాహనం
మండలానికి ఒకటి చొప్పున ఉచిత పరమపద వాహనాన్ని పంపిణీ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ వాహనం అన్ని గ్రామాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, కీసర ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, కీసర ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్‌శర్మ, మల్లారెడ్డి ట్రస్టు చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి, కీసర ఎంపీడీవో పద్మావతి, మండల విద్యాధికారి శశిధర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, నందారెడ్డిలతో పాటు పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రోటరీ క్లబ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.