Kumba | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో హీరో ఎంత శక్తివంతంగా ఉంటాడో, విలన్ పాత్ర కూడా అంతే బలంగా నిలుస్తుంది. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్ర ‘కుంభ’ గురించి పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో ఇదే అత్యంత విభిన్నమైన, అంచనా వేయలేని పాత్ర అని ఆయన తెలిపారు.
సాధారణంగా మంచి–చెడు అనే స్పష్టమైన రేఖలతో ఉండే పాత్ర కాకుండా, ఈ కుంభ క్యారెక్టర్ పూర్తిగా గ్రే షేడ్స్‌తో సాగుతుందని చెప్పారు. ఎప్పుడు ఏం చేస్తాడో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఈ పాత్రను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. తన నిజజీవితానికి పూర్తిగా భిన్నమైన డార్క్ రోల్ కావడం వల్ల ఇది తనకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందన్నారు. రాజమౌళి దర్శకత్వ శైలి గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. జక్కన్న సెట్స్‌లో నటీనటులు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండరని, ప్రతి సీన్లో కొత్త ఛాలెంజ్ విసురుతూ నటుల నుంచి అత్యుత్తమ నటన రాబడతారని తెలిపారు. ఆ ఒత్తిడి వల్లే సహజమైన ఎమోషన్స్ బయటకు వస్తాయని, అదే రాజమౌళి పర్ఫెక్షన్ సీక్రెట్ అని పేర్కొన్నారు. ఒక సీన్ పక్కాగా వచ్చే వరకు వదలరని ఆయన అన్నారు.
సినిమాలో కుంభ గెటప్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వీల్‌చైర్, ‘డాక్టర్ ఆక్టోపస్’ తరహాలో రోబోటిక్ చేతులు వంటి ఎలిమెంట్స్‌తో పృథ్వీరాజ్ లుక్ భయానకంగా ఉండనుందని సమాచారం. కేవలం కళ్లతోనే భయపెట్టే విధంగా ఈ పాత్రను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చూడని సైకలాజికల్ విలన్‌గా ‘కుంభ’ నిలుస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ సెట్లు, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం నటుల ఎక్స్‌ప్రెషన్స్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఒక క్లోజప్ షాట్లో నటుడు ఇచ్చే భావ వ్యక్తీకరణే సినిమాకు ప్రాణం అని జక్కన్న నమ్ముతారని చెప్పారు. ఎంత పెద్ద యాక్షన్ సీన్ జరిగినా, నటుడి ముఖంలో చిన్న మార్పును కూడా కెమెరాలో బంధించేందుకు రాజమౌళి ఎక్కువ సమయం కేటాయిస్తారని వివరించారు.మొత్తానికి ‘వారణాసి’లో హీరో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సమానంగా నిలిచే ‘కుంభ’ విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది.