మేడ్చల్ రూరల్, ఆగస్టు 2: మేడ్చల్ పట్టణంలో 50 పడకల మాతాశిశు దవాఖాన ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) వెనుకభాగంలో నిర్మించనున్న ఈ మాతా శిశు దవాఖానకు బుధవారం ఉదయం 9 గంటలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు బాల వికాస సంస్థ రూ. 50 లక్షలతో ఆధునీకరించిన సీహెచ్‌సీని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్, మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో సర్కారు దవాఖానలు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు. ఘట్కేసర్లో 100 పడకల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. శామీర్‌పేటలో పోస్టుమార్టమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డీఎంహెచ్‌వో ఆనంద్, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, బాలవికాస సంస్థ ప్రతినిధి శౌరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.