సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): 1952లో హిమాయత్‌నగర్‌లోని వీధి నం: 8లో ఏర్పాటు చేసిన గౌడ హాస్టల్ భవనం ఆత్మగౌరవం చాటేలా సగర్వంగా యువతను అక్కున చేర్చుకొని ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేస్తున్నదని గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ తెలిపారు. బుధవారం హాస్టల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, గౌడ హాస్టల్ భవన నిర్మాణానికి ఎనిమిది మంది సామాజిక బాధ్యతగా ఒక కమిటీగా ఏర్పడి చిత్తశుద్ధితో పనిచేసి ముందుకు నడిపారని, అప్పటి నుంచి నిరంతరాయంగా ఎంతో మంది విద్యార్థులకు ఆశ్రయమిస్తూ హాస్టల్ కొనసాగుతున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం, వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు 68 మందిని అందించిన ఘనతను ఈ హాస్టల్ సొంతం చేసుకున్నదని వివరించారు.
ప్రస్తుతం 370 విద్యార్థులు, 160 మంది విద్యార్థినులను అక్కున చేర్చుకొని ఆశ్రయమిస్తూ.. అక్షర అధ్యయన కేంద్రంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో 917 గజాల్లో నిర్మిస్తున్న భవనానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం, నిర్మిస్తున్న హాస్టల్ భవనం త్వరలోనే పూర్తి కానుందని, రాష్ట్ర మంత్రులు భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నాలుగు గదులతో ప్రారంభమైన గౌడ సంఘం హాస్టల్ ప్రస్తుతం 530 మంది ఉండే స్థాయికి చేరుకున్నదని పేర్కొన్నారు. హాస్టల్లో విద్యార్థుల కోసం వెయ్యి లీటర్ల తాగునీటి శుద్ధి యంత్రంతో పాటు 40 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గౌడ హాస్టల్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. రాష్ట్రం ఏర్పాటు అనంతరం, విద్యార్థుల కోసం కొత్తగా రెండు స్టడీ హాల్స్ ప్రారంభించినట్లు చెప్పారు.
విద్యార్థుల విజయాలకు వారధి
విద్యార్థుల విజయాలకు వారధిగా గౌడ హాస్టల్ నిలుస్తున్నది. నేను 1976లో సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ్యుడిగా చేరి 2005, 2008, 2016, 2019లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. హాస్టల్ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అధునాతన లైబ్రరీని ఏర్పాటు చేశాం. ప్రతి పనిని పారదర్శకంగా చేస్తే.. ఫలితాలు ఎంతో ఉత్తమంగా ఉంటాయనడానికి హాస్టల్ ఒక ఉదాహరణ. నిరుపేద గీత కార్మికుల పిల్లలకు ఉచిత వసతిని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. భగాయత్ హాస్టల్‌ను అందరి సహకారంతో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. అంతే గాకుండా గౌండ్ల సామాజిక వర్గానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నెల 12న గౌడ సంఘం భవనానికి శంకుస్థాపన చేయనుండటం గొప్ప విషయం.
– గౌడ హాస్టల్ , అధ్యక్షుడు ,పల్లె లక్ష్మణ్ రావు గౌడ్