జీడిమెట్ల, ఆగస్టు 2: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను బాలానగర్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.80లక్షల 350 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను డీసీపీ సందీప్ తెలియజేశారు. మహారాష్ట్ర దక్షిణ షోలాపూర్, గో డా తండాకు చెందిన రవిధన్ సింగ్ చౌహాన్ (37), ఒడి స్సా రాష్ట్రం మల్కంగిరి జిల్లా షేర్పల్లికి చెందిన నర్సింగ్ మాడి(32), మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా, తుల్జాపూర్ తాలుకా ఖడిక్విల్ గ్రామానికి చెందిన కిరణ్రామ్ పవార్ (35), మహారాష్ట్ర దక్షిణ షోలాపూర్ బక్షి హిప్పర్ గావిల్కు చెందిన వికాస్ మాన్సింగ్ చౌహాన్(43), మహారాష్ట్ర పూణే జిల్లా అకురిదివిల్కు చెందిన అదేశ్ శంత్ కుమార్ జాదవ్(22), మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా సావెత్ ఖేడ్ తండాకు చెందిన సర్జిరావ్ కిషన్ చౌహాన్(36)లు కొంత కాలంగా ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో రవిధన్ సింగ్ 800 కిలోల గంజాయిని సరఫరా చేసేందుకు కొంత మొత్తాన్ని నర్సింగ్ మాడికి పంపగా 350 కిలోల డ్రై గంజాయిని సమకూర్చాడు. సదరు గం జాయిని తరలించే క్రమంలో పలు చెకింగ్ పాయింట్లను తప్పించుకున్న నిందితులు నగర శివారుకు చేరుకున్నారు. అప్పటికే గంజాయి అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ, శామీర్పేట్ పో లీసులు బాలానగర్ డీసీపీ సందీప్ ఆదేశాల మేరకు శామీర్పేట పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద చెకింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో అటుగా షిఫ్ట్ వాహనంలో వచ్చిన నిందితులను పట్టుకుని విచారించగా, బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న విషయాన్ని బయటపెట్టారు. నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ నారాయణ గౌడ్, పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, శామీర్పేట సీఐ సుధీర్ కుమార్, బాలానగర్ ఎస్ఓటీ సీఐ జేమ్స్బాబు, శామీర్పేట ఎస్ఐలు విజయ్ కుమార్, వీర శంకర్, కిషోర్, శామీర్పేట్, బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.