కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 2: పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఇన్నాళ్లు హరితహారంలో మొక్కలు నాటే పనులను కాంట్రాక్టర్లు చేయగా అధికారులు పర్యవేక్షించేవారు. ఈసారి హరితహారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, మరింత మెరుగ్గా హరితహారాన్ని చేపట్టడానికి, మహిళా పొదుపు సంఘాలకు ఆర్థికంగా చేయూతనందించడమే లక్ష్యంగా నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో మాదిరిగా కాకుండా కాలనీలు బస్తీలలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను స్థానికంగా ఉండే మహిళ, స్వచ్ఛంద, కాలనీ సంక్షేమ సంఘాలకు అప్పగించారు. దీనిలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలో సర్కిళ్ల వారీగా మొక్కలు నాటేందుకు అనువైన కాలనీలను క్లస్టర్లుగా గుర్తించారు. ఒక్కో క్లస్టర్లో మొక్కలు నాటే బాధ్యతను ఒక సంఘానికి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించారు. ఆ క్లస్టర్లో నాటిన మొక్కలను ఏడాది పాటు సంరక్షించాల్సిన బాధ్య త ఆయా సంఘాలపైనే ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న సంఘాలు ఆయా క్లస్టర్లలో మొక్కలు నాటే పనులను ప్రారంభించిటన్లు అధికారులు తెలిపారు.
48 క్లస్టర్లలో 14.40 లక్షల మొక్కలు..
కూకట్పల్లి జోన్లో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. 480 కాలనీలలో హరితహారంలో మొక్కలు నాటేందుకు 48 క్లస్టర్లుగా గుర్తించారు. మూసాపేటలో 10, కూకట్పల్లిలో 10, కుత్బుల్లాపూర్లో 12, గాజులరామారంలో 5, అల్వాల్లో 11 క్లస్టర్లు ఉన్నాయి. 48 క్లస్టర్లకుగాను టెండర్లను ఆహ్వానించగా 48 పొదుపు సంఘాల మహిళలు టెండర్ ద్వారా మొక్కలు నాటే బాధ్యతను తీసుకున్నారు. క్లస్టర్లో పది కాలనీలు ఉండగా ప్రతీ రెండు మీటర్లకు ఒక మొక్క చొప్పున నాటాల్సి ఉంటుంది.
ఒక క్లస్టర్లో 30వేల మొక్కలను నాటాలని జోన్ పరిధిలో 14.40 లక్షల మొక్కలను నాటి సంరక్షించడమే ప్రధాన లక్ష్యం. దీనికిగాను రూ.14.40 కోట్ల నిధులను వెచ్చించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. టెండర్ దక్కించుకున్న మహిళా సంఘాలు మొక్కను నాటేందుకు గుంతను తీయడం, నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకోవడం, మొక్కలను నాటడం, నీరు, ఎరువులను పోయ డం, పశువుల నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవడం, ఏడాది కాలంపాటు మొక్క ఎదిగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొక్కను సంరక్షిస్తే నిర్దేశించిన దాని ప్రకారం ఖర్చులను జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది.