మియాపూర్, ఆగస్టు 2: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకే అందించేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది పకడ్బందీగా సర్వేను చేపట్టాలని చందానగర్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసే విషయంలో బృందాలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తులపై చేపట్టాల్సిన తనిఖీల నేపథ్యంలో సర్కిల్ వ్యాప్తంగా నియమించిన బృందాలకు మంగళవారం డీసీ ఛాంబర్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ సుధాంశ్ మాట్లాడుతూ సర్కిల్ వ్యాప్తంగా మొత్తం 21 బృందాలను ఇందుకోసం నియమించినట్లు, ఒక్కో బృందంలో మొత్తం ముగ్గురు చొప్పున సభ్యులు ఉంటారన్నారు.
దరఖాస్తుదారుడి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందించిన యాప్లో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. దరఖాస్తు దారుడి పేరు, చిరునామా, ఆధార్ సంఖ్య, చరవాణి సంఖ్య సహా ఇతర వివరాలను యాప్లో అక్కడికక్కడే నమోదు చేయాలన్నారు. రోజువారీగా వివరాలను ఉన్నతాధికారులను నివేదించాలన్నారు. పర్యవేక్షక అధికారులు సర్వే తీరును ఆకస్మికంగా తనిఖీ చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని డీసీ సుధాంశ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడున్నందున సర్వే బృం దాలు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు సుధీర్ చంద్ర , వాహెద్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.