హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలుదిక్కులా విస్తరిస్తోంది. ప్రభుత్వం దానికనుగుణంగానే ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా శివారు మునిసిపాలిటీలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో శివారు ప్రాంతా ల్లో అటు మునిసిపాలిటీలు, ఇటు హెచ్ఎండీఏలు అభివృద్ధి పనులు చేపడుతూ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాయి.శివారు ప్రాంతాల అభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైన 10 శివారు మున్సిపాలిటీలైన బండ్లగూడ జాగీర్, నిజాంపేట, జవహర్‌నగర్, నాగారం, దమ్మాయిగూడ, పోచారంలో సుమారు 50 వరకు రోడ్ల నిర్మాణానికే రూ.1500 కోట్లు వెచ్చించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ):గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు మునిసిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు వంటివి ఎంతో కీలకం. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఇవన్నీ అరకొరగానే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ, హెచ్ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలోనే మౌలిక వసతులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో లేకపోవడంతో నివాసం ఉండేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న స్థానిక మున్సిపాలిటీలైన బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట, మీర్‌పేట,నిజాంపేట,బోడుప్పల్, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు జల్పల్లి, నార్సింగి, మణికొండ, కొంపల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, మేడ్చల్ మునిసిపాలిటీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా దృష్టి సారించింది. కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో, అదేవిధంగా శివారు మునిసిపాలిటీల్లోనూ ఉండేలా ఆయా మునిసిపాలిటీలతో కలిసి హెచ్ఎండీఏ సొంత నిధులను వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోంది.
వేగంగా శివారులో పట్టణీకరణ…
కొత్తగా నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున వస్తున్నాయి. ప్రణాళికా బద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ పని చేస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో 37 వరకు మున్సిపాలిటీలు ఉండగా, అందులో పట్టణీకరణ ఎంతో వేగంగా చోటు చేసుకుంటోంది. దానికి అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో స్థానిక మున్సిపాలిటీ నిధులతో పాటు హెచ్ఎండీఏ, నేరుగా ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చుకొని మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
విశాలమైన రోడ్లు….
ప్రస్తుత జనాభాతో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని విశాలమైన రోడ్లు ఉండేలా ప్రభుత్వం ఆయా మునిసిపాలిటీల పరిధిలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రోడ్ల విస్తీర్ణం 60 అడుగుల నుంచి 80,100,120 అడుగుల విస్తీర్ణంతో ఉండేలా హెచ్ఎండీఏ పర్యవేక్షణ చేస్తోంది. కొత్తగా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలంటే అప్రోచ్ రోడ్డు కనీసం 100 అడుగులు ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. వీటికి తోడు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నగరంలోని ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు 33 రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించగా, అందులో 4-5 మినహా మిగతా అన్నింటిని పూర్తి చేశారు.
శివారు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దీంతో కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రవీణ్‌చారి, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ