సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ):శాంతి భద్రతలు.. నేరాలకు సంబంధించిన అంశంలో ఏదైనా ఘటన జరిగిందంటే టాస్క్‌ఫోర్స్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతాయి. ఒక పక్క శాంతి భద్రతల పోలీసులు దర్యాప్తులో ఉండగానే.. టాస్క్‌ఫోర్స్ నేరస్తులను పట్టుకోవడంలో వేగంగా స్పందిస్తాయి. శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ సంచలనాత్మక కేసులను గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుంటారు. ఇలాంటి వ్యవస్థను ట్రాఫిక్ విభాగంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు మొదటి సారిగా ప్రయోగం చేస్తున్నారు.
వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడంలో సాధారణ పోలీసింగ్‌లో టాస్క్ఫోర్స్ది కీలకపాత్ర. ప్రతి రోజు ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్, మరో పక్క క్రమబద్ధీకరణ చేయడానికి అదే సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో రద్దీ వేళల్లో ఉన్న సిబ్బంది పూర్తిగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకే పరిమితమవుతున్నారు. అయినా కూడా ఉల్లంఘనలు కొనసాగుతుండడం, ఫుట్‌పాత్ అక్రమణలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలలో ఈ టాస్క్‌ఫోర్స్ నిమగ్నమై ఉంటుంది. తొలి దశలో బయోడైవర్శిటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, కేబుల్ బ్రిడ్జి, ఐకియా రోటరీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్, మూసాపేట్ నుంచి కూకటల్‌పల్లి జంక్షన్ వరకు ఈ టాస్క్‌ఫోర్స్ సేవలను ఉపయోగించాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో..
ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. సిబ్బంది విధి విధానాలకు సరిపోయే విధంగా కొత్త డిజైన్లతో ఆధునిక బైక్‌లు సమకూర్చడం, అందులోనే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలు ఉండేవిధంగా చూసుకోవడం, బైక్‌లపై వెళ్తున్నప్పుడు మైక్ ప్యాక్‌తో మాట్లాడకుండా ఉండేలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు బైక్‌కు కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, బైక్ నడుపుతూనే వివరాలు కమాండ్ అండ్ కంట్రోల్‌కు పంపించడం, సైరన్, బ్లింకర్ లైట్లు ఇలా ఆధునికంగా వాహనాలను తయారు చేసి సిబ్బందికి ఇవ్వనున్నారు. ప్రధానంగా కాలర్ మైక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మ్యాన్ ప్యాక్‌తో మాట్లాడుతూ బైక్ నడపడం కుదరదు. దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ప్రత్యేకంగా తయారు చేసిన కాలర్ బటన్‌ను అందుబాటులోకి తేనున్నారు.
బైక్ నడుపుతూ కాలర్బటన్తోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తారు. సాధారణ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ఏదైనా అనుమానాస్పద విషయాన్ని టాస్క్‌ఫోర్స్‌కు చేరవేస్తే, శాంతి భద్రతల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దిగుతారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే వారు తమ పనులలో నిమగ్నమై ఉంటారు. శాంతి భద్రతల పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు పనులు మొదలు పెడుతాయి. మొదటి దఫాలో ఆరు ప్రాంతాలలో ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్ బృందాలతో వచ్చే ఫలితాలను బట్టి మరిన్ని చోట్లకు విస్తరించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.