సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం హరితవిల్లుగా రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన హరితహారం ప్రతియేటా విజయవంతంగా కొనసాగుతున్నది. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు పార్కులు గ్రీనరీతో అలలారుతున్నాయి. హరితహారం మొక్కలను సంబంధిత అధికారులు సంరక్షిస్తుండడంతో ఏపుగా ఎదిగాయి. సకాలంలో వర్షాలు కురువడంతో పార్కులు, రహదారులకు ఇరువైపులా నాటిన మొకలతో పచ్చదనం పరవశించిపోతున్నది. హరితహారంలో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసి.. ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ రహదారి, విజయవాడ హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే, బెంగుళూరు హైవేకు ఇరువైపులా మొకలు నాటగా.. అవి కాస్త హరితవనాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లోని ఖాళీస్థలాల్లో ఉద్యమంలా మొకలు నాటారు. నగరంలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్ కోసం సర్వం సిద్ధమైంది. దీనిని విజయవంతం చేయటం ద్వారా నిర్వాహకులకు త్వరలో లేక్ ప్లాంటేషన్ అవకాశాన్ని కూడా కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.