ఎర్రగడ్డ, జూలై 31: టీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా ఎవ్వరికీ లేదని, పొరుగు పార్టీలు మేమంటే మేమే వస్తామంటూ ఉవ్విళ్లూరుతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో వివిధ బస్తీలకు చెందిన సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖేష్ కుమార్ నేతృత్వంలో పార్టీలో చేరిన అందరికీ గులాబీ కండువాలు వేసి గోపీనాథ్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరబండలో ఇతర పార్టీలకు చెందిన వేలాది మంది ఇప్పటికే గులాబీ చెంతకు చేరారు. ముఖేష్ కుమార్తో పాటు విశాల్, శ్రీమాన్ యాదవ్, షానవాజ్, ప్రేమ్, సల్మాన్, అభిషేక్, వైభవ్, మణిరాం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
పగటి కలలు కంటున్న విపక్షాలు: గోపీనాథ్
బోరబండ బస్టాప్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్లో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టే సత్తా ఎవరికీ లేదన్నారు. ఉప ఎన్నికలో ఒకటి.. రెండు సీట్లు వచ్చినంత మాత్రాన అధికారం మాదే అంటూ బీరాలు పలుకుతున్న బీజేపీ పగటి కలలు కంటున్నదన్నారు. గత ఏడేళ్ల వ్యవధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు వెచ్చించటం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ కుమార్, తన్నుఖాన్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్ సిరాజ్, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.