మేడ్చల్, జూలై 31(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు లక్ష్యంగా ఉద్యాన వన శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా ఉద్యాన వన శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లాలో కూరగాయలను పండించి నగరానికి కూరగాయల కొరత లేకుండా చేయలన్నా లక్ష్యంతో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన వన శాఖ చర్యలు చేపట్టింది. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కూరగాయల నారును సబ్సిడీపై అందించనున్నారు. సబ్సిడి అందించే విధి విధానాలపై అవగాహన కార్యక్రమంలో రైతులకు వివరించనున్నారు. రైతులు పండించే కూరగాయల పంటల వివరాలను ఉద్యాన వన శాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్నట్లయితే సబ్సిడీపై కూరగాయల నారును 15 రోజులలో సిద్ధం చేసి రైతులకు అందించనున్నారు. అలాగే, మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్గించనున్నారు. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత సీజన్లో కూరగాయలు పండించేలా సిద్ధం చేసిన ప్రణాళికను అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తోటల అభివృద్ధి పథకం..
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా పండ్ల సాగులో రైతులకు 40 శాతం సబ్సిడీ అందించనుంది. ఈ పథకంలో మామిడి, జామ, బత్తాయి, దానిమ్మ, సీతాఫలం, అంజీర పూల తోటల సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీపై మొక్కలు, ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో వివిధ రకాల పండ్ల సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మేడ్చల్ జిల్లాను కూరగాయలు, పండ్ల సాగు హాబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పడావుగా ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చే విధంగా రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.