సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఫేస్బుక్ పరిచయంతో ఓ సైబర్ చీటర్‌కు అనుచరురాలిగా మారి అమాయకులను కొల్లగొడుతున్న మహిళా చీటర్‌ను శనివారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సైబర్ చీటర్ బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తూ కమీషన్లు తీసుకుంటూ లక్షలు కొట్టేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన ఓ మహిళ గుర్తు తెలియని మెసేజ్‌కు స్పందించి, పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ వచ్చిన ఆఫర్‌కు బోల్తా పడి మొత్తం రూ.18.83 లక్షలు పొగొట్టుకుంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంక్ ఖాతాల ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన ఆల్ఫియా షేక్ ఇజ్రాయిల్‌ను అరెస్టు చేశారు. నిందుతురాలి నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ చీటర్‌కు అనుచరురాలిగా…
మహరాష్ట్ర వార్దా ప్రాంతానికి చెందిన ఆల్ఫియా షేక్ ఇజ్రాయిల్ నర్సింగ్ కాలేజీలో చదువుతుంది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రాడెక్ట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. సంస్థ సామగ్రిని ఆన్లైన్లో విక్రయానికి పెట్టేది. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన రాజ్వీర్ పరిచయమయ్యాడు. వేగంగా డబ్బు సంపాదించేందుకు మార్గాలు చూపిస్తానని చెప్పి 3 రోజులకు బ్యాంక్ ఖాతాను అద్దెకు ఇస్తే రూ.3 వేలు ఇస్తానని చెప్పడంతో ఆమె తన ఖాతాను అద్దెకు ఇచ్చింది. ఇలా రాజ్వీర్ చెప్పినట్లు చేసి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారందరి నుంచి బ్యాంక్ ఖాతాలను తెరిపించింది.
ఆ ఖాతా వివరాలను రాజ్‌వీర్‌కు అందించి, అందుకు ప్రతి ఖాతాకు 1000 కమీషన్, ఖాతాదారులకు రూ. 3 వేలు అద్దె ఇచ్చాడు. ఇలా మొత్తం పెట్టుబడులంటూ మోసం చేసిన నగదును ఈ ఖాతాల్లో బదిలీ చేసుకుని, ఆ తర్వాత వాటిని రాజ్వీర్ ఇతర వాలెట్లు, ఏటీఎమ్‌లు ద్వారా డ్రా చేసుకుని కోట్లు కొట్టేస్తున్నట్లు తేలింది. సైనిక్‌పురి ఫిర్యాదుకు సంబంధించి ఆల్ఫియా ఖాతాలో 1.14 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరో ఖాతాదారుడు నజర్ భాషాను మే నెలలో అరెస్టు చేశారు.
మంచి పెట్టుబడి అవకాశం అంటూ ..
బంజారాహిల్స్, జూలై 30: మంచి పెట్టుబడి అవకాశాలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన ప్రకటన లింక్‌ను ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు రూ.50వేలు కాజేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్న సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ (28) ప్రైవేటు ఉద్యోగి. గత నెల 5న అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వచ్చిన ఓ ప్రకటనను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.50వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.