వరుణుడు కుంభవృష్టి సృష్టించాడు. వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి నుంచి పోటెత్తిన వరదలతో జంట జలాశయాలు నిండుకున్నాయి. అంతకంతకూ నీటి ఇన్‌ఫ్లో అధికం కావడంతో అధికారులు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువన మూసీలోకి వదిలారు. ఎన్నడూలేని విధంగా మూసీ ఉప్పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకున్నది. గలగలా… మూసీ పరుగులిడుతుంటే చూసేందుకు నగర వాసులు మూసీ ఒడ్డుకు చేరుకొని సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. లోతట్టు కాలనీల ప్రజలను పోలీసులు ముందస్తుగా ఖాళీ చేయించి రక్షణ కల్పించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు.
25 నుంచి 30 కుటుంబాలకు రక్షణ
చార్మినార్, జూలై 27 : మూసీ నది ఉగ్రరూపంతో పురానాపూల్ సమీపంలోని వైకుంఠ ధామం నీటమునిగింది. కట్టెలు, ఇతర సామాగ్రి నీటిలో మునిగిపోవడంతో దహన సంస్కరణల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి నుంచే మూసీ వరద ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు, రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. చార్మినార్ మండల పరిధిలోని సాలర్జంగ్ మ్యూజియం, ఇమ్లిబన్ బస్‌స్టాండ్ సమీపంలోని గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 25 నుంచి 30 కుటుంబాలకు సమీపంలోని కమ్యూనిటీ హాల్లో రక్షణ కల్పించినట్లు తాసీల్దార్ మల్లేశ్ కుమార్ తెలిపారు.
చాదర్‌ఘాట్‌లో ఆహారం ప్యాకెట్లు పంపిణీ
చాదర్‌ఘాట్, జూలై 27: మూసీ నది ఉప్పొంగడంతో చాదర్‌ఘాట్ పరిసరాలు నీట మునిగాయి. ఆజంపురా డివిజన్లోని మూసానగర్, కమల్‌నగర్, రసూల్‌పురా ప్రాంతాల్లో మోకాళ్లలోతు మేర వరదలు ప్రవహించడంతో ఇండ్లలోకి నీరు చేరాయి. కాజ్ వే బ్రిడ్జి పక్కన ఉన్న భూకాళీ మాతా అమ్మవారి ఆలయం నీట మునిగింది. సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ సతీశ్ ఇండ్లను ఖాళీచేసి వెళ్లాలని మైకుల ద్వారా సూచించారు. ముంపుప్రాంతాల వారికి సిటీ మోడల్ స్కూల్లో పునరావాసం కల్పించారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల అర్ధరాత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై ఆరా తీశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాధితులకు 2వేల ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు డీసీ జయంత్ తెలిపారు.
మూసీలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు
అబిడ్స్/మెహిదీపట్నం జూలై 27 : మూసీ వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. బుధవారం తెల్లవారు జామున 1:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పురానాపూల్ వద్ద మూసీలో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి అక్కడే విధులు నిర్వహిస్తున్న గోషామహల్ ఏసీపీ సతీశ్ సూచనలతో హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీరాంసైదాబాబు, మంగళ్‌హట్ ఎస్ఐ రాంబాబు ప్రాణాలకు తెగించి మూసీలోకి వెళ్లి సదరు వ్యక్తిని కాపాడారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని అతడు భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు.