మణికొండ, జూలై 27 : జంట జలాశయాలకు పైనుంచి వస్తున్న వరదల ఉధృతి తగ్గడంలేదు. ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్‌సాగర్ జలాశయం వద్ద 13 గేట్లు, హిమాయత్‌సాగర్ జలాశయంలో 8 గేట్లను ఎత్తి నీటిని దిగువన మూసీలోకి వదిలారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలు నీటమునిగిపోగా.. రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపాలిటీ అధికారులు, యంత్రాంగం మూసీ పరివాహక ప్రాంతాల వద్ద పహారా పెంచారు. ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేసి అటువైపుగా ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఏసీపీ రఘునందన్‌రావు, స్థానిక ఇన్స్పెక్టర్ శివకుమార్, సిబ్బందితో కలిసి గండిపేట జలాశయాన్ని సందర్శించారు. అదేవిధంగా చెరువు దిగువన ప్రవహిస్తున్న మూసీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించి భద్రత చర్యలను పరిశీలించారు. అక్కడి నుంచి హిమాయత్‌సాగర్ జలాశయాన్ని సందర్శించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లను సీపీ రవీంద్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రవహిస్తున్నంత సేపు ఎవ్వరినీ కాలువల వద్దకు అనుమతించవద్దని, అదేవిధంగా ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జలమండలి ఎండీ దానకిశోర్ జంట జలాశయాలను బుధవారం సందర్శించి వరదల ఉధృతి ఏ స్థాయిలో కొనసాగుతున్నదని స్థానిక జలమండలి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలి: సీపీ స్టీఫెన్ రవీంద్ర
హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డులో మంగళవారం నీటి ప్రవాహంలో చిక్కుకున్న బీటెక్ విద్యార్థి అరవింద్‌కుమార్ గౌడ్‌ను కాపాడిన ట్రాఫిక్ రికవరీ వ్యాన్ సిబ్బందిని (హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్ మల్జాంగ్ షా, హెల్పర్స్ రాకేశ్, విజయ్) సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అభినందించి రివార్డులను అందించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని తెలిపారు. 24/7 పోలీసులు ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారు డయల్ 100 లేదా 9490617444 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన రెస్క్యూ బృందం
మూసీ పక్కన ఉన్న గదిలో నివాసముంటున్న ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకున్నది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి రాత్రి ఒంటిగంటకు ఆ కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సునీల్‌తో పాటు భార్య లక్ష్మి, వారి బంధువులు భారతి, విజయలక్ష్మి, అక్షర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సహాయక చర్యలు రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ నేతృత్వంలో చేపట్టారు.