సిటీబ్యూరో/సైదాబాద్/సికింద్రాబాద్/కడ్తాల్, జూలై 27(నమస్తే తెలంగాణ): పేకాట శిబిరాల నిర్వహణ.. బడాబాబులతో పరిచయాలు..వెరసి క్యాసినో నిర్వాహకుడిగా ఎదిగిన చికోటి ప్రవీణ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని వినయ్నగర్కాలనీలో నివాసముండే ప్రవీణ్‌పై పలు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారుల బృందం బుధవారం రాత్రి వరకు సోదాలను కొనసాగించింది. అతడితో పాటు అనుచరుడు బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి ఇంటిపై, కడ్తాల్ మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రవీణ్ ఫౌం హౌస్‌తో పాటు పలువురి నివాసాలు, కార్యాలయాలపై మొత్తం ఎనిమిది చోట్ల ‘ఈడీ’ సోదాలు చేపట్టింది. ప్రవీణ్‌కుమార్ క్యాసినో వ్యాపారాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి.. వాటికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. విదేశాలకు నిధులు మళ్లించినట్లు సమాచారం అందడంతో ప్రవీణ్, మాధవరెడ్డిపై ఈడీ అధికారులు ఫెమా నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
ఎవరీ చికోటి ప్రవీణ్.. ?
సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీ శ్రీచక్ర నిలయం ఆపార్టుమెంట్‌లో ఉండే చికోటి ప్రవీణ్‌కుమార్ స్థానిక వినాయక దేవాలయం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోఠిలో శానిటరీ షాపు నిర్వహిస్తున్న సమయంలో కొంతకాలం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పనిచేశాడు. 2007 ఓ భూమి వ్యవహారంలో ప్రత్యర్థులను కిడ్నాప్ చేశారనే ఆరోపణతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఆ సమయంలో మద్దెలచెరువు సూరి, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి వంటి వారితో వ్రవీణ్కు పరిచయాలు ఏర్పడ్డాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత స్థానిక రాజకీయాలకు దూరంగా ఉంటూ పేకాటపై దృష్టి పెట్టాడు. 2017లో ఓ స్టార్ హోటల్లో పేకాట ఆడుతూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. అతడితో పాటు పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వైపు పేకాట..మరోవైపు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించాడు. నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో తన అడ్డాలను రాష్ట్ర శివారు ప్రాంతాలు, గోవా, ఇతర రాష్ర్టాలకు తరలించాడు. గోవా, శ్రీలంక ప్రాంతాల్లో క్యాసినోలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు.
క్యాసినో ఆడించడం..
నగరంలోని రాజకీయ, వ్యాపార, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పోలీసుల విభాగంలో పనిచేసే వారితో సత్ససంబంధాలు కొనసాగించిన ప్రవీణ్.. పేకాట, క్యాసినో అడే వాళ్లను గోవా, శ్రీలంకలకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. సినీ పరిశ్రమ వారితో ఉన్న పరిచయాలతో ఓ చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు. గత జనవరిలో ఏపీలోని గుడివాడలో క్యాసినో నిర్వహించడం అక్కడ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై గుడివాడలో ప్రవీణ్‌పై కేసు నమోదైనట్లు తెలిసింది. శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో తన అడ్డాలను నేపాల్‌కు మార్చి, అక్కడ ఓ హోటల్లో క్యాసినో నిర్వహిస్తూ నిధులను విదేశాలకు మళ్లిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. కాగా, ఈ నెల 12న చంపాపేటలోని ఓ గార్డెన్లో ప్రవీణ్ తన పుట్టిన రోజును పెద్ద ఎత్తున జరుపుకొన్నాడు. ఆ వేడుకలకు రాజకీయ నాయకులు, పలువురు పోలీసులు హాజరయ్యారు. ఆర్భాటాలు ప్రదర్శిస్తూ, జన్మదిన వేడులు జరుపుకొన్న 15 రోజులకే ఈడీ అధికారులు అతడి ఇంటిపై సోదాలు చేయడం గమనార్హం
డేకరేషన్ నుంచి..
బోయిన్‌పల్లిలో నివాసముండే దాసరి మాధవరెడ్డి గతంలో డీకేఆర్ పేరుతో డేకరేషన్స్ చేస్తూ జీవనం సాగించేవాడు. స్థానికంగా అప్పులు చేసేవాడు, పేకాట క్లబ్బులకు వెళ్తూ ప్రవీణ్‌తో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. క్యాసినో అడే వారిని పొగు చేసి వారిని గోవా, శ్రీలంక, నేపాల్ దేశానికి తీసుకెళ్లేందుకు ప్రవీణ్‌కు ఏజెంట్‌గా ఎదిగాడు. ప్రవీణ్‌తోనే కాకుండా గోవాలో ఇతర క్యాషినో కేంద్రాలకు కూడా కస్టమర్లను తీసుకెళ్తూ.. కమీషన్లతో కోట్లకు పడగలెత్తాడు. జూన్‌లో హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారితో మూడు గ్రూప్‌లు తయారు చేసి.. నేపాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్రవీణ్‌తో కలిసి నిధుల మళ్లింపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి ఇళ్లు, అతడికి సంబంధించిన కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, మాధవరెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని కారుపై తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అది నకిలీదా? ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నారు.