సోమవారం సాయంత్రం చిన్నపాటి ముసురుతో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారు జాము వరకు దంచి కొట్టింది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాలతో పాటు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా 13.5 సెం.మీటర్ల వర్షం పడటంతో శివారులోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నగర వీధులు జలమయం అయ్యాయి. ఈసీ, మూసీ నదులు ఉప్పొంగాయి. జంట జలాశయాలకు వరదలు పోటెత్తడంతో నిండుకుండలా మారాయి. అప్రమత్తమైన అధికారులు జంట జలాశయాల గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదిలారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. రాగల నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ, ఈసీ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరు, వికారాబాద్ ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీకి భారీ వరద వస్తున్నది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షంతో ఇటు ఈసీకి కూడా వరద పోటెత్తుతున్నది. ఈ క్రమంలో నగర శివారులోని జంట జలాశయాలకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద అంతకంతకూ పెరిగింది. దీంతో జలమండలి అధికారులు క్రమంగా గేట్లను ఎత్తుతూ మూసీలోకి జలాలను వదులుతున్నారు. మంగళవారం రాత్రి వరకు మూసీలోకి పదివేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తుండటంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా సోమవారం అర్ధరాత్రి వికారాబాద్‌లో 12.9సెం.మీ, పూడూరులో 10సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం పడింది. మంగళవారం రాత్రి 8గంటల వరకు షాబాద్‌లో 12.3సెం.మీ, చేవెళ్లలో 13.5సెం.మీటర్లు వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 10.6సె.మీ, సైదాబాద్, కూర్మగూడలో సుమారు 9 సెం.మీ, బహదూర్‌పుర, చార్మినార్, మల్లేపల్లిలో 8.5సె.మీ, మలక్‌పేట, అమీర్‌పేట, పంజాగుట్ట, నారాయణగూడలో 8సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
హిమాయత్‌సాగర్‌లో ఆరు గేట్లు ఎత్తివేత
గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్ జలాశయం జలకళను సంతరించుకున్నది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 1763.5 అడుగులు కాగా 1762 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మంగళవారం 10గేట్లను ఎత్తివేశారు. ఈసీ పరీవాహక ప్రాంతం మీదుగా 5వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. పైనుంచి నీటి ఉధృతి క్రమంగా తగ్గడంతో నాలుగు గేట్లను మూసివేసిన అధికారులు 6గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలైన కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్‌హౌస్ త్రివేణి సంగమం వరకు అధికారులు ఈసీ పరివాహక చుట్టు పక్కల ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీల అధికారులు ఆయా ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరో రెండు గేట్లు రాత్రికే ఎత్తివేసే అవకాశం ఉందని డీజీఎం రేణుక తెలిపారు.
మరో 4 రోజులు భారీ వర్షాలు
ఆగ్నేయ, మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
హిమాయత్‌సాగర్ రాత్రి 7 గంటల సమయానికి..
పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) 1763.50 అడుగులు 2.970 టీఎంసీలు
ప్రస్తుత నీటి మట్టం 1761.25 అడుగులు 2.480 టీఎంసీలు
ఇన్‌ఫ్లో – 3,500 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,910 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య – 17, ఎత్తినవి – 6 (రెండు ఫీట్లు)
గండిపేట 12గేట్లు ఎత్తివేత
చారిత్రాత్మక గండిపేట చెరువు(ఉస్మాన్‌సాగర్) జలాశయానికి వరద ఉదృతి అంతకంతకూ పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 10గంటలకు ఏకంగా 12గేట్లు ఎత్తి 7308 క్యూసెక్కుల నీటిని జలమండలి శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి 6800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా 12 గేట్లను దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఎత్తివేయడం విశేషం. 2010లో కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పట్లో 5వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఇప్పుడు 7308 క్యూసెక్కుల నీటిని వదలడంపై అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.
మూసీ పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాలు మంచిరేవుల, డ్యూస్ విల్లాస్, హైదర్షాకోట్, లంగర్‌హౌస్ త్రివేణి సంగమం వరకు ప్రజలను అప్రమత్తం చేసి మూసీ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకుండా రాత్రిపూట భద్రత చర్యలు, పోలీసు పహారాను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాలైన మూసీ పరివాహకం చుట్టూ నివాసముంటున్న ప్రజలను ఖాళీ చేయించి పలు చోట్ల రాకపోకలను నిలిపివేశారు. గండిపేట చెరువు గరిష్ఠ నీటి మట్టం 1790 అడుగుల వరకు నీరు వచ్చి చేరేప్రమాదం ఉండటంతో సాయంత్రం వరకు 1787.75 (3.384 టీఎంసీ) అడుగులు ఉండగా రాత్రి పదిగంటల వరకు 1788.05 (3.453 టీఎంసీ)లకు చేరుకోవడంతో 10 గేట్ల నుంచి అదనంగా మరో రెండు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. రాత్రి ఏకధాటిగా వర్షం కురిస్తే మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంచిరేవుల నుంచి నార్సింగికి వచ్చే రహదారిని జలమండలి, రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
మూసారం బాగ్ బ్రిడ్జి మూసివేత
మలక్‌పేట, జూలై 26 : ఓ వైపు సోమవారం రాత్రినుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు జంట జలాశయాల గేట్లను ఎత్తి నీటిని కిందికి వదలడంతో మూసీలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం వరకు మూసారం బాగ్-అంబర్‌పేట చాందినీ బ్రిడ్జి వద్ద నీటి మట్టం బ్రిడ్జికి అడుగున్నర కిందికి ఉండగా, సాయంత్రం వరకు ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం వరదనీరు బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి ట్రాఫిక్‌ను గోల్నాక న్యూ బ్రిడ్జివైపు మళ్లించారు. రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ డీసీపీ కర్ణాకర్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, ఏసీపీ సంపత్, మలక్‌పేట ఇన్స్పెక్టర్ జ్యోత్స్న పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిని కూడా మూసివేస్తామని సౌత్ జోన్ సర్కిల్-6 డీసీ జయంత్ తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన ట్రాఫిక్ పోలీసు
హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని ఈసీ నదిలోకి వదలడంతో ఔటర్ సర్వీస్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. అయితే అటుగా వాహనదారులు వెళ్లకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. అయినప్పటికీ వికారాబాద్ జిల్లాకు చెందిన గౌని అరవింద్‌గౌడ్ వరద నీటిలోనుంచే సర్వీస్రోడ్డులోని వంతెన దాటే ప్రయత్నం చేశాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ప్రవాహం తట్టుకోలేక అగిపోయి బారికేడ్లను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాధితుడిని, వాహనాన్ని బయటకు తీసుకువచ్చాడు.
కరెంటు నిలిచిపోగానే.. నిమిషాల్లో ఫీడర్ల పునరుద్ధరణ
భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్ సరఫరాలో మాత్రం అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సరూర్‌నగర్, అస్మాన్గడ్ ప్రాంతాల్లో 6 ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ విభాగం అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 1.50 గంటల నుంచి 11 కేవీ ఫీడర్లు 10 ట్రిప్ అయ్యాయి. 2.35 గంటల సమయంలో 4 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. ఇలా ఉదయం 7 గంటల వరకు గ్రేటర్ పరిధిలో 69 ఫీడర్లు ట్రిప్ కాగా, వాటిలో 67 ఫీడర్ల పరిధిలో నిమిషాల వ్యవధిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, మరో 2 ఫీడర్ల పరిధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.
వరదకు కొట్టుకుపోయిన మంచినీటి పైపులైను
భారీ వర్షాలకు గండిపేట చెరువు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో వరద నీటిని కిందకు వదిలారు. వరదనీటి వేగానికి ఈ మార్గంలో ఉన్న మంచినీటి పైపు లైను కొట్టుకుపోయింది. దీంతో ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని స్థానికులు తెలిపారు.
రైల్వే ట్రాకుల భద్రతకు రైల్వే శాఖ చర్యలు
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు, సరుకు రవాణ కోసం నడుస్తున్న రైల్వే సర్వీసులకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్సీఆర్ ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ డివిజనల్ రైల్వే మేనజర్లను ఆదేశించారు. ముఖ్యంగా ప్రయాణికులకు రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు, రైలు సమయాలను తెలియజేయాలని సూచించారు. వరదల కారణంగా కల్వర్టులు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని, 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తూ రైల్వే ట్రాకులను పర్యవేక్షించాలని తెలిపారు.
ఇది శిథిల భవనం.. పరిసరాలకు రావొద్దు..!
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. గత అనుభవాలు, ఇటీవల వరంగల్‌లో వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని నగరంలోని శిథిల భవనాలపై అధికారులు ప్రత్యేక నజర్ పెట్టారు. ముఖ్యంగా వర్షాకాలానికి ముందే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశంపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు నిర్వహించిన సర్వేలో గ్రేటర్ పరిధిలో 625 ఇండ్లు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యంత ప్రమాదకరస్థాయిలో ఉన్న వాటిని పలు దఫాలుగా కూల్చివేశారు.
ఇప్పటివరకు 231ఇండ్లను పూర్తిగా కూల్చివేసిన అధికారులు.. మరో 294 ఇండ్లకు సంబంధించి వివిధ రకాల చర్యలు తీసుకున్నారు. అందులో కొన్నింటికి మరమ్మతులు చేయడం ద్వారా ప్రమాదం నుంచి అవి బయటపడ్డాయి. మరికొన్ని పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అందులోని వారిని ఖాళీ చేయించారు. ‘ఇది శిథిలావస్థలో ఉన్న భవనం.. పరిసరాలకు ఎవరూ రావద్దని’ హెచ్చరిస్తూ భవనాలకు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి భవనాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి, తగు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.