సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న 28 కోనేరుల (బేబీ పాండ్స్)తో పాటు అదనంగా మరో 50 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకు(బేబీ పాండ్స్)ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. జోన్‌కు ఎనిమిది చొప్పున ఆరు జోన్లలో 48 ఏర్పాటుతో పాటు, అవసరమైతే అదనంగా మరో రెండు చోట్ల ఏర్పాటు చేసేందుకు గానూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ (ఆర్ఎఫ్పీ) పేరిట టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాల నిమజ్జనంతో జలవనరులు కాలుష్యం అవుతున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు గతంలో కోర్టును ఆశ్రయించగా, దీనిపై స్పందించిన హైకోర్టు హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఏడాది అదనంగా మరో 50 ప్రాంతాల్లో మినీ నిమజ్జనం కొలనుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. అయితే, హుస్సేన్‌సాగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నగరంలో ఇప్పటికే 28 చోట్ల మినీ నిమజ్జన కొలనులను నాలుగేండ్ల కిందట జీహెచ్ఎంసీ నిర్మించింది. మూడు నుంచి ఐదు అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఈ కొలనుల్లో నిమజ్జనం చేస్తున్నారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసే ట్యాంకుల నిర్మాణ విషయానికొస్తే 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతులో ట్యాంకులు నిర్మించనున్నారు. పీవీపీ మెటీరియల్‌తో తయారు చేసే ట్యాంకుల ఏర్పాటు నుంచి నిమజ్జనం అనంతరం వాటి తొలగింపు వరకు సంబంధిత ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది. ప్రతి కొలను వద్ద ఆరుగురు కార్మికులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ కొలనులో 10 అడుగుల (మూడు మీటర్లకు మించని) ఎత్తున్న మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ వినాయకుడు మట్టితో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.