సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని మౌలాలి రైల్వే స్టేషన్లో భారీగా పునర్నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మౌలాలి రైల్వే స్టేషన్ భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి స్టేషన్లో అనేక మార్పులు చేర్పులకు పనులపై ఎస్సీఆర్ అధికారులు దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా రైళ్ల రాకపోకలను మెరుగుపరుస్తూ సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు ప్రస్తుత రైల్వే స్టేషన్ ఆధునీకరణకు, రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.
అందులో భాగంగా కోచింగ్ (ప్రయాణికుల) రైళ్ల నిర్వహణకు రెండు గూడ్స్ లైన్లను లూప్లైన్లుగా మార్చబోతున్నారు. ఈ పనులు పూర్తి చేయడం వల్ల రైళ్ల ప్రయాణికుల కోసం అదనంగా మౌలాలిలో మరో ప్లాట్ ఫామ్ అందుబాటులోకి రానుంది. దీంతో స్టేషన్లో ప్లాట్ ఫారాలు రెండు నుంచి మూడుకు పెరుగుతాయి. ఈ మూడు ప్లాట్ఫారాలు కూడా వెంటనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, సరుకు లోడింగ్, అన్ లోడింగ్ కోసం అదనపు ప్లాట్ ఫామ్ ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
సిగ్నలింగ్ పనులలో భాగంగా స్టేషన్కు ఇరువైపుల గల క్యాబిన్లలో ప్రస్తుత ప్యానెల్ స్థానంలో అడ్వాన్సుడ్ ఇంటర్ లాకింగ్తో సహా ‘బి’ క్యాబిన్లో 63 రూట్లు, ‘ఏ’ క్యాబిన్లో 41 రూట్లు ఏర్పాటు చేశారు. పాత పాయింట్లను తొలిగించినట్లు ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. అదనంగా ఎల్సీ గేట్ మరమ్మతు పనులు నిర్వహించి, 60 కేజీల స్లీపర్లతో భర్తీ చేస్తారు. ఇలాంటి పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడం వల్ల సికింద్రాబాద్, కాచిగూడ టెర్మినళ్లపై ప్రస్తుతం పడుతున్న ఒత్తిడి భారీగా తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.