సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): అల్లం, వెల్లులి పేస్టు కుళ్లిపోకుండా ఉండేందుకు ఓ నిర్వాహకుడు ఏకంగా అనారోగ్యానికి దారితీసే రసాయనాలు వాడుతున్నాడు. మనుషుల ఆరోగ్యానికి ఇది హానికరమని తెలిసినా అవేవి పట్టించుకోకుండా కోళ్ల దాణాను సైతం ఇందులో కలుపుతున్నట్లు రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. నాగారం ఈస్ట్ గాంధీనగర్‌లోని ఓ అల్లం వెల్లులి పేస్టు తయారీ చేసే ఓ చిన్న గోదాంలో ఎస్ఓటీ పోలీసులు మంగళవారం సోదాలు జరిపారు. లైసెన్స్ ఉండి ‘మాధవి’ బ్రాండ్‌తో తయారు చేస్తున్న అల్లం వెల్లులి పేస్టును రసాయనాలతో నిల్వ ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఈ గోదాంను నిర్వహిస్తున్న భాను ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గోదాం నుంచి అజానటాక్స్ టైటానియమ్ డయాక్సైడ్ అంటేజ్ 40 కేజీలు, కోళ్ల దాణా 30 కేజీలు, అసిటిక్ యాసిడ్ 20 లీటర్లు, సిట్రిక్ యాసిడ్ 20 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. హానికర ఈ రసాయనాలతో తయారు చేసిన 4044 కేజీల అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు.