బంజారాహిల్స్, జూలై 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సర్కిల్ 18లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8వ విడత హరితహారం నిర్వహించేందుకు అవసరమయ్యే మొక్కలను సర్కిల్ పరిధిలోని నర్సరీలలో సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10(సి)లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని విజయానర్సరీలో ఎవెన్యూ ఫ్లాంటేషన్ కోసం భారీగా మొక్కలు సిద్ధ్దంగా ఉంచారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో కాలనీలు, బస్తీలతో పాటు ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లపక్కన, ఫుట్పాతలపై నాటేందుకు సుమారు 50 వేల మొక్కలను సిద్ధం చేశారు. సాధారణ మొక్కలకంటే ఎత్తైన మొక్కలను నాటడం ద్వారా త్వరగా పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని సిద్ధ్దంగా ఉంచారు. కానుగ, ఫెల్టో ఫారమ్, వేరు మద్ది, రావి, చైనా బాదం, ఫ్యాథోడియా, కదంబ. బాదంచ అల్లనేరేడు, బహోనియా తదితర మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో నాటనున్నారు.
18 వార్డు లెవల్ నర్సరీల్లో 2.5లక్షల మొక్కలు
కాలనీల్లోని పార్కులతో పాటు ఖాళీ ప్రదేశాలన్నింట్లో మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందిస్తున్న యూబీడీ అధికారులు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు వార్డు లెవల్ నర్సరీలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఇతర ప్రాంతాలనుంచి మొక్కలు తెప్పించి నాటాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించేందుకు వార్డు లెవల్ నర్సరీల ద్వారా ఎక్కడికక్కడ మొక్కలు సిద్ధం చేసుకున్నారు. 18 వార్డు లెవల్ నర్సరీల్లో కలిసి సుమారు 2.5 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. వీటిలో పూల మొక్కలు, తులసి, సీతా ఫలం, కానుగ తదితర పదికి పైగా రకాలైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
ప్రజలకు పంపిణీ చేసేందుకు మొక్కలు సిద్ధ్దం
హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్కిల్ పరిధిలో భారీగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాం. జనవరి నుంచే పలు ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నాం. కాలనీలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో భారీగా మొక్కలు నాటాం. హరితహారం కార్యక్రమం తేదీలు ప్రకటించిన వెంటనే ప్రజలకు పంపిణీ చేసేందుకు వార్డులెవల్ నర్సరీల్లో మొక్క లు సిద్ధం చేశాం. పూలమొక్కలు, ఔషదమొక్కలతో పాటు పండ్ల మొక్కలు ప్రజలకు పంపిణీ చేస్తాం. ఇప్పటికే కొన్ని కాలనీలు 80 శాతం గ్రీన్ కాలనీలుగా ఉన్నాయి. ఆయా కాలనీలను వందశాతం గ్రీన్ కాలనీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– బాలయ్య, యూబీడీ విభాగం, జీహెచ్ఎంసీ సర్కిల్ 18