సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): మత్తుపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. విక్రయిస్తున్న, సేవిస్తున్న వారిపై నిఘా పెంచి మెరుపు దాడులు చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిని ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. అయినప్పటికీ మత్తు బాబులు మారడం లేదు. పోలీసుల కండ్లు గప్పి మత్తు పీల్చి.. కిక్కులో మునిగి తేలేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. పోలీసులకు దొరకకుండా.. ఇండ్లను అద్దెకు తీసుకుని మత్తు పీల్చేస్తున్నారు. కిక్కు దిగేవరకు అద్దె గదిలోనే ఉంటున్నారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో అంతా యువకులే ఉండటం గమనార్హం.
చదువుకుంటామని అద్దెకు..!
మత్తు పీల్చేందుకు చదువును వాడేస్తున్నారు. చదువుకునేందుకు వచ్చామని చెప్పి కాలనీల్లో సింగిల్ బెడ్ రూమ్, సింగిల్ రూమ్‌లను అద్దెకు తీసుకుంటున్నారు. రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మత్తు పదార్థం (డ్రగ్స్, గంజాయి, ఇతర) దొరకగానే వారి వాట్సాప్ ద్వారా గ్రూపు సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. వెంటనే గ్రూప్ సభ్యులంతా అద్దె గదికి చేరుకుంటారు. స్నేహితులంతా కలిసి మత్తు సేవించి.. మత్తు దిగేవరకు అందులోనే గడుపుతున్నారు.
మెరుపు దాడుల్లో కీలక సమాచారం
మత్తు (గంజాయి, డ్రగ్స్) సేవిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఇటీవల రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నాచారం, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిపిన సోదాల్లో కీలక సమాచారం లభించింది. దాడులు జరిపిన రెండు ప్రాంతాల్లో రెండు కేజీల పైనే గంజాయి దొరికింది. యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. బయట సేవిస్తే దొరికి పోతామనే భయంతోనే గదిని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు సంఘటనల్లో దాదాపు 9 మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం నాచారం, నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు.
గ్రూప్ స్టడీ చేస్తున్నామని..!
కొందరు యువకులు మత్తు సేవించేందుకు వారి తల్లిదండ్రులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రూప్ స్టడీ చేస్తున్నామని, ఫ్రెండ్స్‌తో డిస్కర్స్ చేస్తూ చదువుకుంటామని, దీంతో డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని తల్లిదండ్రులకు చెప్పి నమ్మిస్తున్నారు. వారి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునేందుకు వెళ్లారనే బ్రమలోనే ఉండగా.. స్నేహితులంతా అద్దె గదికి చేరుకుని మత్తు పీల్చి ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో పట్టుబడటంతో తమ పిల్లలు చేస్తున్న పనికి తలదించుకుంటున్నారు. తల్లిదండ్రులు గుడ్డిగా నమ్మేసి పిల్లలను వదిలేయడంతోనే వారు మత్తుకు బానిసలువుతున్నారు.
అద్దెకు ఇచ్చిన ఇండ్లపై నజర్ పెట్టండి
యువకులకు, కొత్త వారికి ఇండ్లను అద్దెకు ఇచ్చే సమయంలో కచ్చితంగా వారి పూర్తి వివరాలను సేకరించాలి. యజమానులు అద్దెకు ఉంటున్న వారి వ్యవహారాలపై నజర్ పెట్టాలి. ఆ ఇండ్లకు యువకులు లేదా ఇతర గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అధికంగా వస్తున్నారా.., ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అద్దె కోసం వచ్చే వారి గుర్తింపు కోసం ధ్రువీకరణ పత్రాలను సేకరించుకోవాలి. ఫోన్ నంబర్లను తీసుకోవాలి. వారి ముందే వాటిని డయల్ చేసి చెక్ చేసుకోవాలి. పోలీసుల సోదాల్లో అద్దె ఇండ్లలో ఉంటున్న వారు గంజాయి సేవిస్తున్నా.. ఆ నివాసంలో మత్తు పదార్థాలు దొరికినా.. వాటిని చట్టప్రకారం జప్తు చేసుకుంటాం. కఠిన చర్యలు తీసుకుంటాం.
– రక్షిత మూర్తి, డీసీపీ మల్కాజిగిరి జోన్