రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్మీలు, కార్పొరేటర్లు శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. మరి కొన్ని చోట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలు చోట్ల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాల ఏర్పాటు, దవాఖానల్లో రోగులకు పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువ నేతగా, శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు ఉన్న నాయకుడిగా ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలను హైదరాబాద్కు రప్పించి విశ్వనగరం దిశగా అడుగులు వేయిస్తున్నాడని కొనియాడారు. మంత్రి కేటీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలు ఆలయాల్లో హోమాలు సైతం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ భవన్లో మంత్రి జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ సహా టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు రక్తదానం చేశారు.