ఘట్కేసర్ రూరల్, జూలై 24: ప్రతి విద్యార్థి నైతిక విలువలు, క్రమ శిక్షణ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.నాగయ్య తెలిపారు. వెంకటాపూర్ – అనురాగ్ యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో అనురాగ్ ఫార్మాకాన్ ట్రిప్స్-2022 ఆరో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఫార్మసీ రంగానికి చాలా అవసరం ఉందని, నైపుణ్యతను పెంపొందించుకోవటం ద్వారా అవకాశాలు సులభతరం అవుతాయని చెప్పారు. ఈ సదస్సులో నిర్వహించిన ఓరల్, పోస్టర్ ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఓరల్ ప్రదర్శనలో తమిళనాడులోని జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన బి.అపర్ణకు మొదటి బహుమతి, ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జి.లక్ష్మికి ద్వితీయ బహుమతి, పి.రమ్యకు తృతీయ బహుమతి, పోస్టర్ ప్రెజెంటేషన్‌లో మొదటి బహుమతి గుజరాత్‌కు చెందిన క్రీస్ట్ కాలేజ్ విద్యార్థిని ఎ.మోనాల్, ఓయూకు చెందిన జె.సౌమ్యకు ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి వరంగల్‌లోని జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన డి.హనీష్కు తృతీయ బహుమతులను అందజేశారు. ఫార్మసీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను, అవకాశాలుగా మలుచుకోవాలని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు. కో కన్వీనర్ డాక్టర్ శిరీష, కో ఆర్డినేటర్లు, వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.