పహాడీషరీఫ్, జూలై 21 : సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 5, 8, 9, 24, 27, 28 వార్డుల్లో రూ. 3.40 కోట్ల వ్యయంతో చేపట్టబోయే డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జల్పల్లి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనులు పెద్దఎత్తున చేయిస్తున్నానన్నారు. తాగునీటి అవసరాలతోపాటు మురుగు, వర్షపు నీరు సాఫీగా వెళ్లటానికి కోట్లాది రూపాయలతో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నెల కిందట మామిడిపల్లికి వెళ్లే పహాడీషరీఫ్ రోడ్డుకు రూ.3.10కోట్లతో శంకుస్థాపన చేశానన్నారు. ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
డ్రైనేజీ, వాటర్ లైన్లు వేసిన తర్వాత ప్రణాళికాబద్ధంగా సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వంద గజాల లోపు ఉన్న వారికి ఉచిత నీరు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ మేరకు మిగిలిన మిషన్‌భగీరథ పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ సుదర్శన్, సాజిద్, ఆయేషా, కౌన్సిలర్లు జాఫర్బామ్, సయ్యద్ యాహియా, షేక్ అప్జల్, శంషోద్దీన్, శ్రావణ్‌కుమార్, ఖదీర్, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, మహ్మద్ బాయి, షేక్ అలీం, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, యాస్మిన్ బేగం, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.