సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 658 కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 316 కేసులు నమోదు కావడం ఆందోళనకర విషయమని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ సహా నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి మొత్తం 409 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే గ్రేటర్, దానికి అనుబంధంగా ఉన్న రెండు జిల్లాల్లోనే 70 శాతానికి పైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది.
వైరస్‌లో తీవ్రత లేనప్పటికీ, వ్యాప్తి రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క సీజనల్ కేసులు నమోదవుతున్న సమయంలోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తున్నదని, కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలకు దగ్గరి పోలికలు ఉన్నందున ప్రజలు కొంత అయోమయానికి గురయ్యే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు సకాలంలో స్పందించి ఏ చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు ఆధారంగా చికిత్స చేసే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పండుగలతో పొంచి ఉన్న ముప్పు..
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కెట్లకు వెళ్లడం, ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా గ్రేటర్ పరిధిలో బోనాలు మొదలైన విషయం తెలిసిందే. లష్కర్ బోనాలు ముగిసినప్పటికీ ఈనెల 24న హైదరాబాద్ బోనాలు, ఆ తరువాత శ్రావణ మాసం, వినాయక చవితి తదితర పండుగలు వరుసగా ఉండటంతో రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ బూస్టర్ తీసుకోవాలి
నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏండ్లు నిండి, రెండు డోసులు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వల్ల వైరస్ ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ప్రమాద తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. అయితే, చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వైరస్ వచ్చిన దానికంటే.. వైరస్ వచ్చిపోయిన తరువాత పోస్ట్ కొవిడ్‌లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రస్తుతం మనముందు ఉన్న ఆందోళనకరమైన అంశం. అందుకని ప్రజలు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అర్హులైన వారంతా టీకా, బూస్టర్ తీసుకోవడం ఉత్తమం. మాస్క్ లేకుండా బయటకు రావద్దు. జనసమూహాలకు దూరంగా ఉండటం మంచిది. కేసులు పెరుగుతున్నందున భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్పా దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు.
– డాక్టర్ రాజారావు,సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
కరోనా నియమాలు తప్పనిసరి
ప్రజలు కరోనా నియమాలు పాటించాలి. కేసులు మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్‌లో తీవ్రత లేదు. అయినప్పటికీ వ్యాప్తి రేటు క్రమంగా పెరుగుతున్నది. వైరస్ వ్యాప్తి తీవ్రమైతే 4వ వేవ్ తప్పకపోవచ్చు. అయితే, వేవ్ వస్తుందా.. లేదా.. అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఒకరు వైరస్‌కు గురైనా.. ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు, వృద్ధు లు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు రిస్క్‌లో పడే ప్రమాదం ఉంటుంది. కనీసం వారి కోసమైనా జాగ్రత్తలు పాటించండి.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్,ఉస్మానియా జనరల్ హాస్పిటల్