మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపుహాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని, ఎన్ని నిధులైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు.
ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉన్నదని మంత్రిఅన్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. అధికారులు ముందస్తు ప్రణాళికతో పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలన్నారు. మున్సిపాలిటీల్లో పన్నులను సక్రమంగా వసూలు చేస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పన్ను వసూళ్లలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి..
నిలిచిపోయిన పనులను గుర్తించి, పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ పనులను ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతాయన్నారు.
సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలి: కలెక్టర్
అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు వేగవంతం చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ సమస్యలు, సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ హరీశ్ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, ప్రణాళిక అధికారి రామ్మోహన్, ఆర్డీవోలు రవి, మల్లయ్య వివిధ విభాగాల అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.