సికింద్రాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒకటో వార్డులోని బాపూజీనగర్‌లో రెండో రోజు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఇంటింటి పాదయాత్రలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, రానున్న రోజుల్లో వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు కంటోన్మెంట్ వాసులకు అందజేస్తున్నామని, ఇటీవలే తాగునీటి పథకం సైతం వర్తింపజేయడం జరుగుతుందన్నారు. వార్డులోని ప్రతి బస్తీలో గుడ్‌మార్నింగ్ కంటోన్మెంట్ పేరిట పాదయాత్ర చేపడుతానని జక్కుల స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిరిగిరి నర్సింహ, పద్మ, నవీన్‌కుమార్, మల్లికార్జున్, స్రవంతి, సౌజన్య, హరికృష్ణ, పావని తదితరులు పాల్గొన్నారు.