సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ రియల్టర్ హత్య కేసు వెనకాల 13 ఏండ్ల పగ దాగుందని రాచకొండ పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. బుధవారం రాచకొండ పోలీసులు ప్రధాన సూత్రధారితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు 30 లక్షల సుపారీ డీల్ జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేలింది. నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం..జవహర్‌నగర్‌కు చెందిన రఘుపతి ఈ నెల 15న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్, ఎస్వోటీ, కుషాయిగూడ పోలీసులు విచారణను ప్రారంభించారు.
విచారణలో హత్యకు కుట్రపన్నిన దమ్మాయిగూడకు చెందిన సుంకరి శ్రీకాంత్ రెడ్డి, కర్నాటకకు చెందిన మంజునాథ్‌తో కలిసి కిరాయి హంతకులతో 30 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుని రఘుపతిని హతమార్చారని తెలుసుకున్నారు. బుధవారం బొమ్మలరామారం మండలం రంగాపురంలోని ఫాంహౌస్‌లో శ్రీకాంత్ రెడ్డిని, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, కారు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సుపారీ గ్యాంగ్‌ను పట్టుకున్న బృందాన్ని సీపీ మహేశ్ భగవత్ అభినందించి రివార్డులను అందించారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మీ పెరుమాల్, జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తండ్రిని చంపినందుకే..
2009లో మృతుడు రఘుపతి ఓ స్ధల వివాదంలో స్ధానిక రియల్ఎస్టేట్ వ్యాపారి జంగారెడ్డిని హత్య చేశాడు. 2012లో ఈ కేసు కోర్టులో సరైన సాక్ష్యాధారాలు పోలీసులు పొందుపర్చకపోవడంతో వీగిపోయింది. జంగారెడ్డి హత్యకు గురైనప్పుడు అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి వయస్సు 19. రఘుపతి తరచుగా శ్రీకాంత్‌రెడ్డి కనిపించినప్పుడల్లా గల్లా ఎగురేసుకుని తిరిగేవాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డి తన తండ్రిని చంపిన రఘుపతి మీద పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ రెడ్డి తన తండ్రి జంగారెడ్డి ప్రధాన అనుచరుడు మంజునాథ్ సహాయం తీసుకున్నాడు.
మంజునాథ్ కర్నాటకకు చెందిన రిజ్వాన్‌ను సంప్రదించి రఘపతిని చంపడానికి రూ. 30 లక్షల సుపారీ డీల్‌ను మాట్లాడాడు. రిజ్వాన్ తన అనుచరులతో కలిసి ఇటీవల జవహర్‌నగర్‌కు వచ్చి శ్రీకాంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లాట్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటూ పలుమార్లు రెక్కీ నిర్వహించారు. చివరకు ఈ నెల 15న రఘుపతి తన స్నేహితులతో కలిసి ఓ స్థలాన్ని చూసి తిరిగి వస్తుండగా, రిజ్వాన్ ముఠా దాడి చేయడంతో రఘుపతి స్పాట్లో మృతి చెందాడు. ఆ తర్వాత రిజ్వాన్ ముఠా కారు, మోటర్ బైక్‌పై పారిపోయారు. ఈ ముఠాకు శ్రీకాంత్‌రెడ్డి కీసర, ఘటకేసర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వద్ద రూ. 30 లక్షలు ఇవ్వడంతో మారణాయుధాలను పారేసినట్లు దర్యాప్తు వెలుగులోకి వచ్చింది.