జవహర్నగర్, జూలై 20 : పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎందుకులే.. చదువుకున్న కాడికి సరిపోతుంది..అనే రోజులు గతంలో వినిపించేవి. ఆధునిక కాలంలో మగవారితో సమానంగా ఆడపిల్లలు చదువుతోపాటు క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తూ..పథకాలు సాధిస్తూ తగ్గేది లేదు అని నిరూపిస్తున్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని సీఆర్పీఎఫ్ పాఠశాల పూర్వ విద్యార్థి మానస చిన్నప్పటి నుంచే చదువుతోపాటు క్రీడల్లో పాల్గొంటూ త్రోబాల్, షాట్పుట్ పోటీలతో ప్రారంభమైన తన జీవితం..బాస్కెల్బాల్లో ప్రతిభను చాటుతూ మండ ల స్థాయి నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలువురికి ఆ దర్శంగా నిలుస్తున్న దేవరకొండ మానసపై ప్రత్యేక కథనం.
అమ్మానాన్నల ప్రోత్సాహంతో..
మహబూబ్నగర్ నుంచి నగరానికి వలస వచ్చిన మానస కుటుంబం. సాధారణ కుటుంబంలోనే జన్మించింది. తండ్రి కృష్ణ సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరి తల్లి గృహిణి, ముగ్గురు ఆడపిల్లల్లో చిన్న అమ్మాయే దేవరకొండ మానస. ముగ్గురు ఆడపిల్లలేనా అని ఏరోజు ఆ తల్లిదండ్రులు బాధపడలేదు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాదు.. ఆకాశమే హద్దుగా రాణిస్తారని చదువులు చెప్పిస్తూ పిల్లలను ప్రోత్సహించారు ఆమె తల్లిదండ్రులు. మానస చదువుల్లో ప్రతిభ చాటుతూనే.. బాస్కెట్బాల్లోనూ నైపుణ్యం పొంది జాతీయస్థాయిలో రజత పతకం సాధించింది.
కఠోర శ్రమతోనే ఈ స్థాయికి..
చదువుతోపాటు ఆటల్లోనూ కఠోర శ్రమతో నైపుణ్యం సాధిస్తుండగా.. ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ నన్ను గుర్తించి బాస్కెట్బాల్ పోటీల్లో మెలకువలు నేర్పించేవారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పట్టు సాధిస్తే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తారని, పైస్థాయి చదువులకు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ పొందుతారంటున్నది మానస. ప్రస్తుతం ఎంబీఏ పూర్తి కావడంతో పూర్తిస్థాయిలో క్రీడలపై దృష్టి సారించినట్లు ఆమె చెప్పారు.
ప్రోత్సహిస్తే అంతర్జాతీయస్థాయిలో రాణిస్తా..
ప్రభుత్వం ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ..రాష్ర్టానికి పేరు తెస్తా. ఏ పోటీల్లో పాల్గొన్నా తన సొంత ఖర్చులతోనే క్రీడల్లో పాల్గొంటున్నాను.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తెస్తా.
– మానస, బ్యాడ్మింటన్ క్రీడాకారాణి
క్రీడలకు నిలయం సీఆర్పీఎఫ్ పాఠశాల
సీఆర్పీఎఫ్ పాఠశాలలో చదివే పిల్లలకు చదువుతోపాటు క్రీడలకు మంచి ప్రాధాన్యత లభిస్తున్నది. గతంలో చదివిన విద్యార్థులు పాఠశాలకు ఎన్నో పతకాలు సాధించారు. విద్యార్థులకు క్రీడా ప్రాంగణం, సకల వసతులు ఉండటంతో విద్యార్థులు మరింత రాణిస్తున్నారు. ప్రశాంతవంతమైన పాఠశాల క్యాంపస్లో చదివే పిల్లలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న మానస రజత పతకం సాధించడంతో మా పాఠశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. – రాజశేఖర్, ఫిజికల్ డైరెక్టర్