రవీంద్రభారతి, జూలై 19: కుల మత ఆధిపత్యాలు కొనసాగినంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదని, ఈ గొడవలే దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి అని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సాహిత్య అకాడమీ కార్యాలయంలో ‘పాలడుగుల నాగయ్య సమగ్ర సాహిత్యం’ అన్న పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించిన అనంతరం, ఆయన మాట్లాడుతూ నేడు కుల మతాల ఆధిపత్యాలే భారతీయ సమాజాన్ని కుంగదీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి దగ్గరి నుంచి పాలడుగు నాగయ్య వరకు కుల మత ఆధిపత్యాలపై తిరుగబడినవారేనన్నారు. కులమత ఆధిపత్యాలకు తెలంగాణ సమాజం ఏనాడు ఒప్పుకోలేదని, తెలంగాణ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, రచయిత్రి గోగు శ్యామల , సంగిశెట్టి శ్రీనివాస్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, అశోక్ కుమార్, తెలుగు భాషా సమితి అధ్యక్షుడు బడే సాబ్, కార్యదర్శి జయప్రకాష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
మన విస్మృత కవులపై పరిశోధన అభినందనీయం
తెలంగాణ విస్మృతికి గురైన కవులు ఎందరెందరో ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసి వారిపై సమగ్ర అధ్యయనం చేయడం అభినందించతగిన విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ‘తెలంగాణ విస్మృత కవులు – సమగ్ర అధ్యయనం’ అన్న అంశంపై పెబ్బేటి మల్లికార్జున్ చేసిన పరిశోధన గ్రంథాన్ని మంగళవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అందజేశారు. మల్లికార్జున్ శ్రమించి చేసిన ఈ పరిశోధన ఈ తరం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ రచయిత పెబ్బేటి మల్లికార్జున్, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడే సాబ్, కార్యదర్శి జయప్రకాష్లు పాల్గొన్నారు.