కీసర, జూలై 19 : అన్ని దానాల్లో కన్న విద్యాదానం గొప్పదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాంపల్లిదాయరకు చెందిన పంచాయతీ సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి స్వచ్ఛందంగా అందజేసిన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్‌ను మంత్రి హాజరై పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో బాగా చదివి ప్రయోజకులు కావాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో సృజనాత్మకత దాగి ఉంటుందని, ఇందుకు వారు ఎంచుకున్న రంగాల్లో బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే గొప్పవారయ్యారని తెలిపారు. దాత, టీఆర్ఎస్ నాయకుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
సేవా దృక్పథంతో ఇంకా దాతలు ముందుకురావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచులు మాధురి వెంకటేశ్, రాజుముదిరాజ్, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌శర్మ, ఎంపీడీవో పద్మావతి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కందాడి శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్, శశికాంత్, జంగయ్యయాదవ్, మల్లారెడ్డి, భానుశర్మ, పంచాయతీ సభ్యులు, నేతలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ ప్రభుత్వ పాఠశాలలో..
ఘట్కేసర్,జూలై19 : ఘట్కేసర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు మంగళవారం జనచైతన్య సమితి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు నందరాజ్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఘట్కేసర్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు 60 మందికి నోటు పుస్తకాలు అందజేశారు. పాఠశాలకు ఇద్దరు విద్యా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు నర్సింగ్‌రావు, రవీందర్,బాలిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, నాయకులు దేవేందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.