తెలుగు యూనివర్సిటీ, జూలై 18: సమాజ శ్రేయ స్సు కోసం గొప్ప కవితలను రాసిన కృష్ణమూర్తిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అభినందించారు. సృజన భారతి సాంస్కృతిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగింది. సృజన భారతి సంస్థ లోగోను, ప్రముఖ రచయిత నారా కృష్ణమూర్తి రచించిన సృష్టి-ప్రకృతి-మనిషి కవితా సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొలిపై కవితలు రాశారని ప్రశంసించారు. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షోపన్యా సం చేస్తూ రాజీపడని తత్వంతో గొప్ప కవితలను సృజించారని కృష్ణమూర్తిని ప్రశంసించారు. కవితా సంపుటిని తాళ్ళ నిరంజన్ గౌడ్‌కు రచయిత కృష్ణమూర్తి అంకితం చేశారు. నృత్య కళాకారిణి యామిని అడుసుమిల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. సృజన భారతి అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొమ్మూరి ప్రసాద్, రసమయి అధ్యక్షులు డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర ఆర్ట్ థియేటర్ కార్యదర్శి మద్దాళి రఘురామ్, నారా కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బంధాలు.. బంధుత్వాలతోనే మనకు బలం..
ఉరుకులు పరుగుల ఆధునిక సమాజంలో బంధాలు బంధుత్వాలు కనుమరుగు అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. సాహితీ కిరణం ఆధ్వర్యంలో ఏసీ గార్డ్స్ లో గల రమణాచారి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్త ఎం.బాల గంగాధరయ్య రచించిన ‘బంధువులు-బంధాలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రమణాచారి కవితా సంపుటిని ఆవిష్కరించారు. కవితా సంపుటిని సాహితీ కిరణం మేనేజర్ పొత్తూరి జయలక్ష్మి పరిచయం చేయ గా, కళా పత్రిక సంపాదకులు రఫీ పాల్గొన్నారు.
భక్తి భజన సంకీర్తనలను కాపాడుకోవాలి
రవీంద్రభారతి: తిరుమల తిరుపతి దేవస్థానములు, తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో భక్తిభజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ వాగ్గేయ వైభవమ్-60, 61, రాష్ట్ర స్థాయి సంకీర్తన పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి విచ్చేసి మాట్లాడుతూ భక్తి భజన సంకీర్తనలు అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ భక్తి భజన సంకీర్తనలో 124 బృందాలకు పోటీలు నిర్వహించారు. అందులో 44 బృందాల కు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి బహుమతులు ప్ర దానం చేస్తామని శివప్రసాద్, సుధారాణి తెలిపారు.