సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వర్షా లు, వరదల నేపథ్యంలో నగరానికి వస్తున్న కృష్ణా, గోదావరి నీళ్లను ఎప్పటికప్పుడు పకడ్బందీగా శుద్ధి చేసి అందిస్తున్నామని జల మండలి యంత్రాంగం తెలిపిం ది. సాధారణంగా నదుల వరద నీటిలో మడ్డి శాతం ఎనిమిది నుంచి 10 ఎన్టీయూల వరకు ఉంటుంది. అంటే 800 శాతం మడ్డి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నా రు. ఇలాంటి వంద రెట్ల బురదను స్వచ్ఛమైన నీటిగా మార్చుతున్నారు. ఇందులో భాగంగా, నిత్యం 15000 నీటి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జల మండలి అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి వరద పోటెత్తడంతో నీటిలో అత్యధికంగా బురద, మడ్డి(టర్బిడిటీ) ఉంటుందని, పాలి అల్యూమినియం క్లోరైడ్ (పీఏసీ)ని ప్రత్యేకంగా తెప్పించి ఈ జలాలను శుద్ధి చేస్తున్నట్లు పే ర్కొన్నారు. గోదావరి జలాల విషయంలో ఎలాంటి ఆం దోళన అక్కర్లేదని, నీరు తాగడానికి సురక్షితమైనదని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. 155313కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచించారు.
స్వచ్ఛ జలాలుగా మార్చుతున్నారిలా..
గోదావరికి పెద్ద ఎత్తున వరద రావడంతో నీటిలో అత్యధికంగా బురద, మడ్డి(టర్బిడిటీ) ఉంటున్నాయి. సాధారణంగా నది నీటిలో బురద మడ్డి శాతం 8 నుంచి 10 ఎన్టీయూ (నెప్లెలో మెట్రిక్ టర్బిడిటీ యూనిట్) వరకు ఉంటుంది. వీటిని శుద్ధి చేస్తే తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆలం (పటిక/స్పటిక) కలపడం వల్ల ఈ డర్బిడిటీ పోయి నీళ్లు స్వచ్ఛంగా మారతాయని, వరదల కారణంగా ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి సేకరిస్తున్న నీటినిలో ఏకంగా 800 ఎన్టీయూ శాతం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాలి అల్యూమినియం క్లోరైడ్ (పీఏసీ)ని ప్రత్యేకంగా తెప్పించి ఈ జలాలను శుద్ధి చేస్తున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి డ్యాం నుంచి సేకరించిన జలాలను ముమ్మూరు, బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ల నుంచి తరలించి మల్లారం వాటర్ ట్రీ ట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) వద్ద శుద్ధి చేస్తున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు, అనంతరం రెండు రింగు మెయిన్ల ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు చేర్చుతున్నారు.
ఏమరపాటుతో నష్టాలివి…
వానా కాలంలో కలుషిత నీటితో వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమని వైద్యులు చెబుతున్నారు.
కలుషిత నీటిని తాగితే డయేరియాకు దారి తీస్తుం ది. తొలుత వాంతులు, విరోచనాలు అవుతాయి. నగరంలో ఇలాంటి కేసులు ‘ఫీవర్’ ఆసుపత్రిలో కనిపిస్తుంటాయి. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం.
ఇ.కొలి, కోలిఫాం అనే బ్యాక్టీరియాలు ఉన్న నీటిని తాగితే కలరా కాటేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివి…
నీటిని కాచి వడబోయడమే శ్రేయస్కరం.
నల్లా నీళ్లను నేరుగా పట్టుకోకుండా బిందెలతో తెల్ల టి బట్ట గాని, జాలితో గాని వడబోసి పట్టుకుంటే మంచిది. ప్రధానంగా నల్లా మొదటి 15 నిమిషాలకు దూరంగా ఉంటే మరి మంచిది.
అనేక ప్రాంతాల్లో నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో నిల్వ ఉంచిన నీటిలో క్లోరిన్ బిళ్లలు వేస్తే మంచిది. ఒక బిందెలో ఒక క్లోరిన్ బిళ్ల వేసుకుంటే సరిపోతుంది. మోతాదు ఎక్కువైన ఆరోగ్య సమస్యలొస్తాయి.
సాధ్యమైనంత వరకు ఎక్కుడ పడితే అక్కడ బయటి నీటిని తాగడం నివారించాలి. వీలైతే ఇంటి నుంచి వాటర్ బాటిల్‌ను తీసుకువెళితే మంచిది.