వనస్థలిపురం, జులై 18 : బీజేపీలో తనను అడుగడుగునా అవమానించారని, పై నాయకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ అన్నారు. సోమవారం కార్పొరేటర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో, బీజేపీ వాట్సాప్ గ్రూప్‌లలో అవమానకరంగా తనపై, తనతో ఉన్న నాయకులపై పోస్టులు పెట్టారన్నారు. ఈ విషయమై జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నాయకులకు చెప్పినా కనీస చర్యలు తీసుకోలేదన్నారు. గిరిజన మహిళ అయినందున తనపై ప్రతి చోటా వివక్ష చూపించారని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి చేస్తానని ప్రజలకు చాలా హామీలు ఇచ్చానని, వాటిని నెరవేర్చేందుకు తాను శ్రమిస్తుంటే తనను టార్గెట్ చేస్తూ అవమానాలకు గురిచేశారన్నారు. తనపై ఎంతో బాధ్యత ఉందని, దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
నమ్మకంతో ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే టీఆర్ఎస్లో చేరడం జరిగిందని వివరించారు. డివిజన్ అభివృద్ధే ఏకైక లక్ష్యమని, తనకు ఎలాంటి ఎజెండా లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఇదేనా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. ఆదరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, డేరంగుల కృష్ణ, విజయ్‌కుమార్, రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.