వెంగళరావునగర్, జూలై 18: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాలు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని జీటీఎస్ కాలనీలోని శ్రీ వీరాంజనేయ భవానీ శంకర అయ్యప్పస్వామి సాయిబాబా దేవాలయం (జీటీఎస్ ఆలయం)లో ఆలయ కమిటీ సభ్యులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఆలయాలకు ప్రభుత్వం రూ.15 కోట్లను అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా తొలిదశలో 40 ఆలయాలకు రూ.17 లక్షల 47 వేలు పంపిణీ చేశామన్నారు. బోరబండ లో జరిగే బోనాల ఉత్సవాలకు సినీ రంగ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య విజయ్, సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, జీటీఎస్ దేవాలయ చైర్మన్ చిన్న రమేశ్, ఆయా డివిజన్ల నేతలు పాల్గొన్నారు.
రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్లో…
బేగంపేట్ జూలై 18: రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో మహంకాళి అమ్మవారి జాతర వైభవంగా సాగింది. ఆలయాల్లో బోనాలు సమర్పించిన భక్తులు సోమవారం భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ప్రీతి ప్రాయంగా తయారు చేసిన ఫలహారాలు బండిలో పెట్టి ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలతో ఫలహారపు బండ్లను ఊరేగించారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు సికింద్రాబాద్ లోని పలు అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా శివాజీనగర్ డొక్కలమ్మ, రాష్ట్ర పతి రోడ్‌లోని దండు మారెమ్మ, సెయింట్ మేరీస్ రోడ్‌లోని పీనుగుల మల్లన్న, సెకండ్ బజార్‌లోని పోచమ్మ, ముత్యాలమ్మ, కళాసీగూడలోని శ్రీదేవి పోచమ్మ, స్టేషన్ రోడ్‌లోని రేణుకా ఎల్లమ్మ, తదితర దేవాలయాల్లో రంగంలో భవిష్యవాణి వినిపించారు. రంగం వేడుకల్లో భాగంగా భక్తులను సల్లంగా చూసుకునే బాధ్యత తనదేనని భవిష్యవాణిలో అమ్మ పలుకులు పలికినట్టు దేవాలయాల నిర్వహకులు వెల్లడించారు.
తొట్టెల ఊరేగింపు..సికింద్రాబాద్ పార్కులైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఈ యేడు తొట్టెల ఊరేగింపు లష్కర్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 108 తొట్టెలతో అమ్మవారిని ఊరేగించారు. భక్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు, పార్కులైన్, కళాసీగూడ, టుబాకో బజార్లో ఈ ఊరేగింపు కొనసాగింది.
నల్లపోచమ్మ ఆలయంలో ..
బోనాల జాతరలో భాగంగా రెండో రోజు సామూహిక బోనాలు, తొట్టెలను సమర్పించారు. మొదటిరోజు మహంకాళి అమ్మవారికి, రెండో రోజు నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. చాచానెహ్రూనగర్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపకుడు బండి శాంతికుమార్ ఆధ్వర్యంలో పోతరాజుల నృత్యాల నడుమ తొట్టెలను బన్సీలాల్‌పేట్‌లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి తీసుకెళ్లి సమర్పించారు. నల్లపోచమ్మ ఆలయంలో సతీశ్, రఘువీర్, పురుశోత్తం, యాదగిరి పలువురు అతిథులను ఆహ్వానించి, సన్మానించారు. అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు ఆకట్టుకున్నది.