మారేడ్పల్లి, జూలై 18: సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పోతరాజుల నృత్యాలు…రంగం..అమ్మవారి ఘటాల ఊరేగింపు…యువకుల కేరింతలు ….డప్పు చప్పుళ్లకు దీటుగా ఫలహార బండ్ల ఊరేగింపులు ఘనంగా కొనసాగాయి. మహంకాళి అమ్మవారి బోనాల జాతర కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ( సోమవారం) పలు ఆలయాల వద్ద రంగం ( భవిష్యవాణి) కార్యక్రమాలతో పాటు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతంలో బోనాల ఉత్సవాల్లో ఫలహార బండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫలహారపు బండిని పెద్ద ఎత్తున తీయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
రెజిమెంటల్బజార్లోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. రెజిమెంటల్బజా ర్లోని గండి మైసమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల చేత జానపద, నృత్య, ఆట, పాటతో సందడి చేశారు. జూలేశ్వరి అమ్మవారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ, ముత్యాలమ్మ, ఏడు గుళ్ల అమ్మవారి ఆలయాల్లో రంగం కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు . మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ.. ఉత్సవాలను ప్రశాంతంగా జరిగే విధంగా చూశారు.