బేగంపేట్ జూలై 17: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. రెండేండ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న లష్కర్ వాసులు ఈ సారి రెట్టింపు ఉత్సహంతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఆకట్టుకున్నాయి. మహంకాళి ఆలయంతో పాటు సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలు బోనాల సమర్పణతో పాటు భక్తుల సందర్శనతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. దీంతో పాటు రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్, రాణిగంజ్, రెజిమెంటల్ బజార్, సెకండ్ బజార్, బన్సీలాల్‌పేట్, శివాజీనగర్, నల్లగుట్ట, పార్కులైన్, కళాసీ గూడ తదితర ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాలు సమర్పించారు.
రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్లో ..
రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్ డివిజన్లో బోనాల జాతర వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు నెత్తిన వివిధ రకాల రూపాల్లో తయారు చేసిన బోనాలతో అమ్మవారి ఆలయాలకు తరలి వచ్చారు. శివాజీనగర్ డొక్కలమ్మ, రాష్ట్ర పతి రోడ్‌లోని దండు మారెమ్మ, సెయింట్ మేరీస్ రోడ్‌లోని పీనుగుల మల్లన్న, సెకండ్ బజార్‌లోని పోచమ్మ, ముత్యాలమ్మ, కళాసీగూడలోని శ్రీదేవి పోచమ్మ, స్టేషన్ రోడ్‌లోని రేణుకాఎల్లమ్మ, తదితర ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఆకట్టుకున్న తొట్టెల ఊరేగింపు
అమ్మవారికి సమర్పించే ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేందుకు నిర్వాహకులు వివిధ రకాల అలంకరణతో తయారు చేసిన పలహారపు బండ్లలో దేవాలయాలకు తరలివచ్చారు.
బన్సీలాల్‌పేట్‌లో..
బన్సీలాల్‌పేట్, జూలై 17 : అమ్మవారి బోనాల జాతరను బన్సీలాల్‌పేట్‌లో ఘనంగా నిర్వహించారు. శ్రీనల్లపోచమ్మ దేవాలయం, శ్రీ తాళ్ల ఎల్లమ్మ, పోచమ్మ ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో బోనం సమర్పించారు. చాచానెహ్రూనగర్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపకుడు బండి శాంతికుమార్ ఆధ్వర్యంలో పోతరాజుల నృత్యాల నడుమ తొట్టెలను ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వరకు తీసుకెళ్లి సమర్పించారు. కార్పొరేటర్ హేమలత, లక్ష్మీపతిలను పలు దేవాలయాల నిర్వాహకులు ప్రత్యేక పూజల అనంతరం శాలువాతో సన్మానించారు. సాయంత్రం నిర్వహించిన ఫలహారం బండ్ల ఊరేగింపు ఆకట్టుకున్నది.