బన్సీలాల్‌పేట్, జూలై 14: చిన్నారులలో వినికిడి సమస్య చికిత్సకు ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు గాంధీ దవాఖాన ఈఎన్టీ విభాగం సిద్ధమవుతున్నది. మానవ దేహంలో తల లోపల అమర్చేదే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ పరికరం. ‘కాక్లియర్ ఇంప్లాంట్’ పరికరం మొదటి భాగం తల లోపల అమరుస్తారు, రెండో భాగం చెవి పైన అమరుస్తారు. ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 1980 నుంచి ఈ విధానం అమలులో ఉంది. పుట్టుకతో వినికిడి సమస్య ఉండే చిన్నారులను నగరంలోని అన్ని మెటర్నిటి దవాఖానలలో మాదిరిగానే ‘యూనివర్సల్ న్యూబోర్న్ చైల్డ్ స్క్రీనింగ్ ప్రొగ్రామ్’ పేరుతో గాంధీ దవాఖానలో కూడా ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అప్పుడే పుట్టిన చిన్నారులకు వినికిడి శక్తిని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ గుర్తించిన చిన్నారులకు ‘కాక్లియర్ ఇంప్లాంట్’ పరికరం అమర్చేందుకు ఇప్పటి వరకు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానకు సిఫారసు చేసేవారు.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతి రావడంతో టీఎస్ఎంఐడీసీ ద్వారా నూతన యంత్రాలు, పరికరాలు, ఆపరేషన్ థియేటర్ సామగ్రి అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఎంప్యానల్మెంట్ కమిటీ వచ్చి ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మూడేండ్లలోపు చిన్నపిల్లలకు ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టి) విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎ.శోభన్‌బాబు అన్నారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువు వినికిడి శక్తిని గుర్తించగలిగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నదని అన్నారు. దేశ జనాభాలో రెండు శాతం చిన్నపిల్లలు, యాభై శాతం వృద్ధులలో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, తొలిదశలోనే చిన్నారులలో వినికిడి శక్తిని, సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
ముందుగా ‘న్యూబోర్న్ చైల్డ్ స్క్రీనింగ్ ప్రొగ్రామ్’ ద్వారా పుట్టిన రోజే స్క్రీనిం గ్ చేస్తామన్నారు. ఇందులో ఎక్కువగా నెలతక్కువలో పుట్టిన వారు, తక్కువ బరువుతో పుట్టిన వారు, కామెర్లు, లేదా ఇతర అనారోగ్య సమస్యలతో జన్మించిన వారు, పుట్టిన తరువాత పదిహేను నుంచి నెల రోజుల వరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని తెలిపారు. పుట్టుకతోనే రెండు చెవులలో వినికిడి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే ముందుగా స్పీచ్ థెరపీ నిర్వహించిన తరువాత వినికిడి శక్తి పెరగకపోతే ఆ తరువాత ఇయర్ కెనాల్, డ్రమ్స్ చూసిన అనంతరం ఈఎన్టీ వైద్యులు ఫైనల్‌గా అన్ని నార్మల్‌గా ఉంటే ‘కాక్లియర్ ఇంప్లాంట్’ అమర్చాల్సి వస్తుందన్నారు. ఇందుకు చిన్నపిల్లల వైద్యుల అభిప్రాయం, క్లినికల్ సైకాలజిస్టుల అభిప్రాయం, కార్డియాలజిస్టుల అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు.
పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
ఒక్కొక్కరికి 10 నుండి 15 లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఈ ‘కాక్లియర్ ఇంప్లాంట్’ను ప్రభుత్వం ‘ఆరోగ్య శ్రీ’ ట్రస్ట్ ద్వారా పూర్తి ఉచితంగా అందిస్తున్నది. ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్ చేయగానే మాటలు వినపడవు, ఆ తరువాత నిరంతరం థెరపీ నిర్వహిస్తూ, తల్లిదండ్రులు వైద్యులను సంప్రదిస్తూ, పిల్లలను జాగ్రతగా చూసుకోవాలి. అందుకే తల్లులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మూడేండ్ల వరకు పరికరం విక్రయించిన సంస్థ గ్యారంటీ ఇస్తుంది. ఆ తరువాత కూడా అవసరం ఉంటే బాదితులు సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఈ పరికరాలను పొందవచ్చు.
– డాక్టర్ ఎ.శోభన్‌బాబు,ఈఎన్టీ విభాగాధిపతి