గోల్నాక, జూలై 16: దళిత బంధు పథకం ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న దళారులను ఎట్టి పరిస్థితులలోనూ నమ్మొదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. శనివారం గోల్నాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండవ విడత కింద ఎంపికైన లబ్ధిదారులకు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింప జేస్తామని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో దళిత బంధు దరఖాస్తుల స్వీకరణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
కొందరు దళారులు పథకం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, లబ్ధిదారులు నయా పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే లబ్ధిదారులకు అవసరమైతే ఆటో కిరాయి కూడా తానే ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు ఎంచుకోవడంతో పాటు తమకు అనుభవం ఉన్న రంగంలో రాణిస్తూ మరో పది మందికి ఉపాధి కల్పించి అర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శంగా ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం ప్రయోజనాన్ని వర్తింపజేస్తామన్నారు. రూ.పది లక్షలతో ఒకే యూనిట్ కాకుండా కుటుంబంలోని సభ్యులకు రెండు, మూడు యూనిట్లు కూడా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఆదాయాన్ని ఇచ్చే యూనిట్లు ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.