ముషీరాబాద్, జూలై 16: నియోజకవర్గంలో త్వరలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేథ్యంలో గుంతల రోడ్లకు మరమత్తులు, కొత్త డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు పనులు వేగంగా చేపట్టనున్నట్లు చెప్పారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బోనాల ఉత్సవాల నిర్వహణ, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమత్తులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 180కి పైగా ఉన్న అమ్మవారి ఆలయాల వద్ద బోనాల ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ శ్రేణులు స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయాల వద్ద మంచినీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పుట్‌పాత్‌లు, అలంకరణ వంటి ఏర్పాట్లు చూడాలని పిలుపునిచ్చారు. డివిజన్ కమిటీల ప్రతినిధులు బస్తీల్లో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి దగ్గరుండి గుంతల రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు. రాంనగర్ సాయిబాబా టెంపుల్, గణేష్ నగర్ లక్ష్మమ్మ పార్కు, రాంనగర్ రామాలయం వీధిలో త్వరలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయనున్నామని ఇందుకోసం ప్రతిపాదనలు సైతం సిద్ధ్దమయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
కేటీఆర్ బర్త్‌డేకు భారీ ఏర్పాట్లు
నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలతోపాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా 24వ తేదీన భారీ ఏర్పాట్లు చేయాలని డివిజన్ కమిటీల నేతలకు సూచించారు. ప్లెక్సీలు, సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్‌లు వంటి కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నేత ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, డివిజన్ల అధ్యక్షుడు రావులపాటి మోజస్, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, బి.శ్రీనివాస్ రెడ్డి, వై.శ్రీనివాస్, రాకేష్, శ్యామ్ యాదవ్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేష్, మల్లిఖార్జున్‌రెడ్డి, రవియాదవ్, సయ్యద్ అస్లాం, శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, శివముదిరాజ్, సుబ్బారావు, మాధవి, శోభ తదితరులు పాల్గొన్నారు.