బంజారాహిల్స్, జూలై 16: సుదీర్ఘ కాలంగా గాయత్రి హిల్స్ వాసులు ఎదుర్కొంటున్న హైటెన్షన్ వైర్ల సమస్యలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో పరిష్కారం లభించనుంది. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గాయత్రిహిల్స్‌లో 15ఏండ్లుగా మసీదు మీదుగా ఉన్న హైటెన్షన్ వైర్లతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇటీవల ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కాలనీవాసులు తెలపడంతో విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.5.94లక్షలు ఖర్చవుతుందని అధికారులు చెప్పడంతో నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యే దానం నాగేందర్ మంజూరు చేయించారు. శనివారం నిధుల మంజూరు పత్రాన్ని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో పాటు కాలనీవాసులకు ఎమ్మెల్యే దానం అందజేశారు. త్వరలోనే హైటెన్షన్ వైర్లను తొలగించి అండర్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రీహిల్స్ అధ్యక్షుడు కొమ్మినేని రాఘవులు, వెంకటేశ్‌యాదవ్, భరత్, టి. గోపీశివ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలి..
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున అర్హులైన వారంతా బూస్టర్ డోస్ వేయించుకోవాలని ఎమ్మెల్యే దా నం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బూస్టర్ డోస్ కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నందున 18ఏండ్లు దాటిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయించాలని ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. అన్ని యూపీహెచ్‌సీలలో బూస్టర్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మాస్కులు వాడడం ద్వారా కరోనాతో పాటు ఇతర సమస్యలనుంచి కాపాడుకోవచ్చని అన్నారు.