జూబ్లీహిల్స్, జూలై 16: కాయకల్ప పురస్కారాల్లో శ్రీరాంనగర్ క్లస్టర్ అవార్డుల పంట పండించింది. నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతంచేసే దిశగా కాయకల్ప పురస్కారాలు అందిస్తారు. ఇటీవల ప్రకటించిన ఈ అవార్డుల్లో హైదరాబాద్ జిల్లాలో శ్రీరాంనగర్ క్లస్టర్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో వైద్య సేవలందిస్తున్న వివిధ వైద్య విభాగాలలో 441 ప్రభుత్వ వైద్యశాలలకు కాయకల్ప పురస్కారాలు ప్రకటించగా ఇందులో హైదరాబాద్ జిల్లాకు 8 అవార్డులు దక్కాయి. జిల్లాలో 40 పీహెచ్‌సీలను కాయకల్ప పురస్కారాలకు నామినేట్ చేయగా బోరబండ పీహెచ్‌సీకి ప్రథమ, శ్రీరాంనగర్ పీహెచ్‌సీకి ద్వితీయ రన్నరప్ బహుమతులతో పాటు క్లస్టర్ పరిధిలోని బంజారాహిల్స్‌కు ప్రోత్సాహక బహుమతి లభించింది.
ఆధునిక వైద్యసేవలందిస్తున్న పీహెచ్సీలలో అందుకుతగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ అవార్డులను అందిస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్న పీహెచ్సీలలో రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ పురస్కారాలను ప్రకటించారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీలకు గ్రేడింగ్ ఇచ్చి 70 శాతానికి పైగా మార్కులు పొందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ జాతీయ స్థాయి పురస్కారాలు ప్రకటించారు. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన బోరబండ పీహెచ్‌సీకి రూ.2 లక్షలు, ద్వితీయ రన్నరప్ బహుమతి పొందిన శ్రీరాంనగర్‌కు రూ. లక్ష నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతి పొందిన బంజారాహిల్స్ పీహెచ్‌సీకి కూ.50 వేల నగదు బహుమతులు దక్కాయి. శ్రీరాంనగర్ క్లస్టర్‌కు కాయకల్ప పురస్కారాలు రావడం పై ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీవల్లి, అశ్రిత హర్షం వ్యక్తం చేశారు.
బాధ్యత మరింత పెరిగింది
శ్రీరాంనగర్ క్లస్టర్‌కు కాయకల్పలో ఒకేసారి మూడు పురస్కారాలు దక్కడం సమష్టి కృషి వల్లే సాధ్యమైంది. ఆశ వర్కర్ల నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు అంకితభావంతో పనిచేసిన వైద్య సిబ్బందికి దక్కిన పురస్కారం ఇది. జిల్ల్లాలో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంతో పాటు ప్రోత్సాహక బహుమతుల్లో ఒకటి దక్కడం మా బాధ్యతను మరింత పెంచింది.
–డాక్టర్ అనురాధ, ఎస్పీహెచ్వో