బంజారాహిల్స్,జూలై 16: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గంలో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నీ లీగ్ దశ ముగియడంతో జూలై 20 నుంచి 23దాకా నిర్వహించనున్న ఫైనల్ రౌండ్ పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టోర్నీ విజేతలకు బహూకరించనున్న ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. యువతలో స్ఫూర్తి నింపుతున్న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు జూన్ 24నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.
నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీలకు సంబంధించిన యువ క్రికెటర్లను భాగస్వామ్యం చేయడంతో సుమారు 136 జట్లు లీగ్ దశలో పాల్గొన్నాయన్నారు. లీగ్దశలో విజేతలుగా నిలిచిన 14జట్లతో జూలై 20నుంచి చివరి రౌండ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నామన్నారు. ఈనెల 23న ఎస్పీఆర్ హిల్స్‌లోని 4ఎకరాల గ్రౌండ్లో టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుందని పేర్కొన్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.2లక్షల నగదు బహుమతితో పాటు ట్రోఫీని బహూకరిస్తామని, రన్నరప్ జట్టుకు రూ.లక్ష నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందిస్తామన్నారు.
మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.50వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందిస్తామన్నారు. టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనబర్చిన యువ క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అత్యుత్తమ కోచింగ్ ఇప్పించి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం కల్పించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది క్రీడాకారులు ఇటీవల మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రోత్సాహం కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, దేదీప్యరావు. సీఎన్ రెడ్డి, రాజ్కుమార్పటేల్, సంగీతాయాదవ్ పాల్గొన్నారు.