మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు దేశంలోనే చరిత్రను సృష్టిస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరిలో దళితబంధు పథకం కింద మొదటి విడుతలో ఎంపిక చేసిన 500 మంది లబ్ధిదారులకు పది లక్షల రూపాయలను అందిస్తున్నామని.. రెండో విడుత లబ్ధిదారులనూ త్వరలో ఎంపిక చేస్తామని వివరించారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధును అందిస్తామన్నారు. మేడ్చల్ జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి లభించడం ఖాయమన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని.. ఇందులో భాగంగానే బస్తీ దవాఖానలతో పాటు కార్పొరేట్‌స్థాయిలో వైద్యశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు.
క్షమాపణలు చెప్పాలి..
దళితబంధు పథకంపై దళితులందరూ సంతోషంగా ఉంటే కాంగ్రెస్ మాత్రం ఓర్వలేకపోతున్నదని.. దళితబంధుపై కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యుడు హరివర్ధన్‌రెడ్డి సర్వసభ్య సమావేశంలో ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. దళితబంధుతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంటే జీర్ణించుకోలేక దళితులను అవమానించేలా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి
మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఇందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.