జాతరకు రెండు రోజుల ముందే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి
ఒడి బియ్యం, బోనాలు సమర్పించారు.
బేగంపేట జూలై 15:పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు హోరెత్తాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు,దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ భక్తజన మండళ్ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
ముఖ ద్వారాలు ప్రారంభం
హాజరైన మంత్రులు తలసాని,మహమూద్‌అలీ, మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి తలసాని భార్య మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సొంత నిధులు రూ.58 లక్షలతో ఓల్డ్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ సమీపంలో, బాటా వద్ద నిర్మించిన ఆలయ ముఖ ద్వారాలను మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి పోతరాజులతో కలిసి నృత్యాలు చేశారు. మంత్రి తలసాని భార్య స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్‌రెడ్డి, గజ్జెల నాగేశ్, రాజీవ్ సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
బేగంపేట్, జూలై 15: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
బోనమెత్తిన లాల్‌దర్వాజ
పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 114వ వార్షిక బ్రహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకం, సప్తశతి పారాయణం, తదితర పూజలు జరిగాయి. ఆలయ ఫోర్‌మెన్ కమిటీ చైర్ పర్సన్లు శీరా రాజ్‌కుమార్, చెన్నబోయిన శివకుమార్ యాదవ్, ఎ.బద్రీనాథ్‌గౌడ్, పోసాని సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ అమ్మవారి ధ్వజారోహణ, శిఖరపూజ నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ ఎ.మాణిక్‌ప్రభు కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్ర్తాలు సమర్పించారు.