సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి.. జ్వర సర్వే చేపట్టింది. నగరంలో ఇప్పటి వరకు 500కు పైగా డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో 30 శాతం కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివే. వారు ఇక్కడ చికిత్స చేయించుకుని సొంత ప్రాంతాలకు వెళ్లగా.. మిగిలిన వారి ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వెయ్యి ఇండ్లలో జ్వర సర్వే జరిపినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఇందులో 178 మందికి సాధారణ జ్వర లక్షణాలు గుర్తించి, మందులు పంపిణీ చేశారు. అలాగే బస్తీ దవాఖానలు, యూపీహెచ్‌సీలకు సిఫారసు చేశారు.