బడంగ్‌పేట, జూలై 15: మీర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమెద్ జలీల్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి తెలిపారు. మీర్‌పేట ప్రభుత్వ పాథమిక పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్ డి.సైదులుకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమెద్ జలీల్, ఇంటర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, డీఐఈవో వెంకటయ్య నాయక్, బాధ్యతలను అప్పగించారు. ప్రిన్సిపాల్‌ను సీట్లో కూర్చోబెట్టి ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మీర్‌పేటలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో వేల రూపాయలు పెట్టి చదువుకోలేని పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు తీసుకొని చదువుకోవాలన్నారు.
ఇక నుంచి మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయించారని అన్నారు. ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనే అనుభవం ఉన్న అధ్యాపాకులు.. నాణ్యమైన విద్యను బోధిస్తారన్నారు. మొదటి రోజు ఇద్దరు అడ్మిషన్లు తీసుకున్నారన్నారు. అడ్మిషన్ల కోసం కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, వెంకయ్య నాయక్, రమేశ్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
కోర్సులు..
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి. కళాశాలకు సంబంధించిన ఫర్నీచర్, స్టాఫ్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగుతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రవేశాల కొరకు ప్రిన్సిపాల్ సైదులును సంప్రదించాలన్నారు. సమాచారం కోసం 9948757372 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు.