మియాపూర్,జూలై 15 : పచ్చదనాన్ని విస్తృతం చేసేందుకు నగర వ్యాప్తంగా బల్దియా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ పేర్కొన్నారు. ఇందుకోసం ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు, దీనిని విజయవంతం చేయటం ద్వారా నిర్వాహకులకు త్వరలో లేక్ ప్లాంటేషన్ అవకాశాన్ని కూడా కల్పిస్తామని అన్నారు. ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో బిడ్ దారులైన పొదుపు సంఘాల మహిళలతో శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ శంకరయ్య సహా డీసీలు యూబీడీ అధికారులతో కలిసి యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచుకునేందుకు ఇదో బృహత్తర కార్యక్రమమని, మొక్కలను బల్దియానే ఉచితంగా అందిస్తుందని, నిర్వాహకులు వాటిని నాటడటంతో పాటు సంపూర్ణ రక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలన్నారు. ఒక్కో మొక్కకు రూ. 107 చొప్పున అందిస్తున్నట్లు కృష్ణ పేర్కొన్నారు. పొదుపు మహిళలకు ఉపాధి పరంగా ఇదో మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకుని పచ్చదనం పెంపు పరిరక్షణలో తమ సత్తాను చాటాలని సూచించారు. జోనల్ కమిషనర్ శంకరయ్య మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి వ్యాప్తంగా ఉన్న 508 కాలనీలను 53 క్లస్టర్లుగా విభజించినట్లు, ఒక్కో క్లస్టర్లో 30వేల చొప్పున ఇంచ్ బై ఇంచ్ మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా జోన్ పరిధిలో లక్షలాది మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పొదుపు మహిళల సందేహాలను జడ్సీ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీలు వెంకన్న, సుధాంశ్, మల్లారెడ్డి, అనీల్, ఇతర అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
బిడ్లు పూర్తి చేసిన తొలి జోన్ శేరిలింగంపల్లి..
ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో బిడ్ దారులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయటంలో శేరిలింగంపల్లి జోన్ బల్దియాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ నెల 7 నుంచి 11 వరకు ఇందుకోసం టెండర్ ప్రక్రియను చేపట్టి 12న టెండర్ల ఖరారు జోనళ్ల స్థాయిలోనే చేపట్టగా.. ఈ ప్రక్రియ కేవలం శేరిలింగంపల్లి జోన్లో మాత్రమే పూర్తయింది. జోన్ వ్యాప్తంగా 53 క్లస్టర్లకు బిడ్లు సకాలంలో దాఖలు.. టెండరు ఖరారు.. వర్క్ ఆర్డర్ల జారీ అంతా నిర్ధారిత షెడ్యూల్ ప్రకారం ఈ జోన్లో పూర్తయింది. మరో వారం రోజులలో ఇంచ్ బై ఇంచ్ ప్లాంటేషన్‌ను సైతం ప్రారంభించేందుకు ఇక్కడి జోనల్ అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు.